Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో చంద్రబాబు మకాం...టిడిపి విలీనం కోసమేనా?: వసంత సంచలనం

చంద్రబాబు సేవలు ఈ రాష్ట్రానికి అవసరం లేదని మైలవరం వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. 

Chandrababu plans To merge TDP?: ysrcp mla vasantha krishna prasad sensational comments
Author
Mailavaram, First Published Sep 3, 2020, 6:26 PM IST

తాడేపల్లి: చంద్రబాబు నాయుడి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఏపికి ఏం ఉపయోగపడిందని... రాష్ట్ర విభజన సమయంలో ఆ అనుభవంతో ఏం సాధించారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ధ్వజమెత్తారు. ఇప్పుడు కూడా చంద్రబాబు సేవలు ఈ రాష్ట్రానికి అవసరం లేదన్నారు కృష్ణప్రసాద్. 

తనతో కలిసి అవినీతి, అక్రమాల్లో పాలుపంచుకున్న అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను పరామర్శించేందుకు చంద్రబాబుకు సమయం ఉంది కానీ రమేష్‌ ఆస్పత్రిలో ప్రమాదం జరిగి 10 మంది చనిపోతే.. విశాఖలోని ఓ పరిశ్రమలో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబుకు సమయం లేదా..? అని ప్రశ్నించారు.

తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన మాట్లాడుతూ.. చంద్రబాబు అనుభవం లోకేష్‌ను ఎమ్మెల్సీని, మంత్రిని చేయడానికి ఉపయోగపడిందని ఎద్దేవా చేశారు. 

పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లిన దాఖలాలు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా హైదరాబాద్‌లో కూర్చొని పొత్తుల కోసం ఆలోచన చేస్తున్నారా..? లేక విలీనం కోసం ఆలోచన చేస్తున్నారా..? అని సెటైర్లు వేశారు. గత ఐదేళ్ల పాలనలో టీడీపీ నేతలు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డారని, కృష్ణా పుష్కరాల్లో రూ.12 వందల కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు.

read more  టీడీపీని వదిలేసి నా మీద విమర్శలేంటి: కరణం, పోతుల సునీతపై ఆమంచి ఫిర్యాదు

పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎం కార్డులా వాడుకుంటున్నారని ప్రధాని మోదీ సైతం చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు ఏటీఎం కార్డులా ఏ విధంగా మారిందో.. దేవినేని ఉమాకు క్వారీలు ఆ విధంగా మారాయని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ధ్వజమెత్తారు. కొండపల్లిలో అన్యాయాలు జరిగిపోతున్నాయని దొంగ ఉమా మాట్లాడుతున్నాడని, క్వారీలను అడ్డంపెట్టుకొని వసూళ్లకు పాల్పడే వ్యక్తి తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

క్వారీలు, క్రషర్‌లకు నోటీసులు ఇప్పించి డబ్బులు వసూళ్లకు పాల్పడే వ్యక్తి దేవినేని దొంగ ఉమా అని తెలిపారు. దేవినేని ఉమా తనపై చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధమని, టీడీపీ అవినీతిపై సీబీఐ విచారణకు దేవినేని ఉమా సిద్ధమా? అని కృష్ణప్రసాద్ సవాల్‌ విసిరారు.

Follow Us:
Download App:
  • android
  • ios