పార్టీ కమిటీల్లో మార్పులు చేర్పులకు చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టనున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించనున్నారు.
అమరావతి: పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఓక్కో మంత్రిని చంద్రబాబునాయుడు ఇంచార్జీగా నియమించారు. వైఎస్ఆర్‌సీపీ తరహాలోనే అడుగులు వేయాలని టీడీపీ భావిస్తోంది.
పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ఇంచార్జీలుగా నియమించే పద్దతి వద్దని ఒకరిద్దరూ నేతలు సూచించాచారు. అయితే చంద్రబాబు వారిపై మండిపడ్డారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించి వైఎస్ఆర్‌సీపీ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించినట్టుగా టీడీపీ భావిస్తోంది.
ఇదే విధానాన్ని అవలంభించాలనే అభిప్రాయంతో టీడీపీ నాయకత్వం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ విధానాన్ని అమలు చేసే విషయమై పార్టీ నాయకత్వం త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. పార్లమెంట్ నియోజకవర్గానికి సమన్వయకర్తను నియమించడం ద్వారా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో సమస్యలపై కేంద్రీకరించే అవకాశం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు.
1994 ఎన్నికలకు ముందు ఒక్కరికే రెండు పదవులు ఉండే విధానానికి టీడీపీ స్వస్తి పలికింది.ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్న వారికి జిల్లా అధ్యక్ష పదవి నుండి తప్పించారు. ఏదో ఒక్క పదవితోనే ఉండేలా చూశారు. ఆ తర్వాత ఈ పద్దతిని ఎందుకో కొనసాగించలేకపోయారు. కొన్ని జిల్లాల్లో అధ్యక్ష స్థానాల్లో కన్వీనర్లను నియమించారు.
ఆ తర్వాత ఆయా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులను ఆయా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఇంచార్జీలుగా నియమించారు. ఇంచార్జీలకు ఎన్నికల్లో టిక్కెట్లను కేటాయించే పద్దతిని ప్రవేశపెట్టారు. అయితే ఇంచార్జీ వ్యవస్థ ద్వారా కోన్ని ఇబ్బందులు వచ్చినట్టుగా చంద్రబాబునాయుడు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో టిక్కెట్ల కేటాయింపు సమయంలో ఇంచార్జీ వ్యవస్థను రద్దు చేస్తామని చంద్రబాబునాయుడు ప్రకటించారు.
పోటీ చేసే అభ్యర్థులకే టిక్కెట్లను కేటాయించనున్నట్టు చంద్రబాబు ఆ సమయంలో తేల్చి చెప్పారు. ఇంచార్జులకే టిక్కెట్లు కేటాయింపు విషయంలో బాబు తన నిర్ణయాన్ని మార్చుకొన్నారు.
పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించడం ద్వారా మరి కొందరికి పార్టీ పదవులు దక్కే అవకాశం ఉంది. కొత్తవారికి కూడ పదవులు దక్కనున్నాయి. మరో వైపు పార్టీలో యువతకు కూడ పెద్ద ఎత్తున అవకాశం కల్పించాలని చంద్రబాబును కొందరు పార్టీ నేతలు కోరారు. ఇదే విషయంపై బాబు కూడ సానుకూలంగా స్పందించారు.
జిల్లా కమిటీలను కొనసాగించాలా... రద్దు చేయాలనే విషయమై కూడ ఇంకా స్పష్టత రాలేదు. జిల్లా కమిటీలతో పాటుగా పార్లమెంటరీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయం కూడ లేకపోలేదు.
మంగళవారం నాడు జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్తల నియామకంపై ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కమిటీలు ఏర్పాటు వద్దని వాదించారు. దీంతో కూన రవికుమార్ పై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైండ్ సెట్ మార్చుకోవాలని బాబు సూచించారు.
పార్టీలో యువతకు పెద్ద ఎత్తున ప్రోత్సహాం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారు. యువతతో పాటు మహిళలకు కూడ కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కూడ బాబుకు కొందరు నేతలు సూచించారు.
సంబంధిత వార్తలు
అప్పుడే జగన్ పై విమర్శలా, వద్దు: అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు భేటీకి కేశినేని, గంటా సహా సీనియర్ల డుమ్మా, కారణం...?
పార్టీలో సమూల మార్పులకు చంద్రబాబు శ్రీకారం
