అమరావతి: ప్రజలు తిరగబడితే రాష్ట్రంలో వైసీపీ నిలువదని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వచ్చామనే గర్వంతో వైఎస్ఆర్‌సీపీ నేతలు వ్యవహరిస్తున్నారని  ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో తాము కూడ ఇలానే వ్యవహరిస్తే వైఎస్‌ఆర్‌సీపీ ఉండేదే కాదని  చంద్రబాబు గుర్తు చేశారు.

వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇలానే వ్యవహరిస్తే గ్రామాల్లో తిరగని పరిస్థితి ఆ పార్టీకి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.బెదిరిస్తే భయపడిపోతామనే భావనలో వైఎస్ఆర్‌సీపీ నేతలు ఉన్నారన్నారు.అరాచకాలు కొనసాగిస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతోందని చంద్రబాబు హెచ్చరించారు.

మంగళవారం నాడు గుంటూరులో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 469 మంది టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయన్నారు.  టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను గ్రామాల నుండి తరిమివేస్తున్నారని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులే టీడీపీ కార్యకర్తలను గ్రామాల్లోకి రాకుండా ఉండాలని కోరుతున్నారని బాబు గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో ఎలా పనిచేశారు, ఇప్పుడెలా పనిచేస్తున్నారో పోలీసులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చంద్రబాబునాయుడు సూచించారు.

ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. కానీ సీట్లు తగ్గాయన్నారు. అసెంబ్లీలో  మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ హుందాగా మాట్లాడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు.

గోదావరి జలాలను శ్రీశైలం ద్వారా రాష్ట్రానికి అందించేందుకు తమ ప్రభుత్వం ప్లాన్ చేసిందన్నారు. అయితే తెలంగాణ భూభాగం నుండి  ఏపీ రాష్ట్రానికి నీటి సరఫరా వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయాన్ని చూడాలని  తాను కోరిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అసెంబ్లీలో కూడ ఇదే విషయాన్ని చెప్పానన్నారు.

సంబంధిత వార్తలు

రాజీనామా చేస్తా: గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన ప్రకటన