చంద్రబాబు కడప మహానాడులో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ ప్రకటించి అభివృద్ధి ప్రణాళికలు వెల్లడించారు. టీడీపీ విజయంపై ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

 

కడపలో మూడు రోజుల పాటు జరిగిన తెలుగుదేశం మహానాడు చివరి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు. దేశం ముందుకెళ్లాలంటే రాజకీయాల్లో స్వచ్ఛత అవసరమని స్పష్టం చేస్తూ, ‘ఆపరేషన్ సిందూర్’ స్ఫూర్తితో రాష్ట్ర రాజకీయాల్లోనూ 'ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్' ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా టీడీపీ పని చేస్తుందని, అధికారాన్ని బాధ్యతగా వహిస్తున్నామని పేర్కొన్నారు.

ఇదంతా కార్యకర్తల సత్తా..

వైసీపీ పాలనను ఎత్తిచూపుతూ, గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలపై ప్రజలు తీర్పు చెప్పారని అన్నారు. ప్రత్యేకించి కడపలో జరిగిన మార్పును ప్రజలు స్వయంగా నొక్కిచెప్పారని అన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ సీమలో ఎక్కువ స్థానాలు గెలిచిందని, 2029 నాటికి అన్ని స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కార్యకర్తల సేవలను ప్రశంసిస్తూ, ఓ వృద్ధ కార్యకర్త సైకిల్‌పై కోడూరి నుంచి మహానాడు‌కు వచ్చిన సంఘటనను ఉదాహరించారు.

సబ్సిడీ నగదు ఖాతాల్లో..

ప్రభుత్వ సంక్షేమం విషయంలో తాము చేసిన చర్యల వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామని, ప్రతి నాలుగు నెలలకు సబ్సిడీ నగదు ఖాతాల్లో వేస్తున్నామన్నారు. డీఎస్పీ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేశామని, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి పథకాలను కొనసాగిస్తున్నామని తెలిపారు.

ఉద్యోగుల సంక్షేమం కోసం...

పురోగమనానికి బీసీల సహకారం కీలకం అని చెప్పిన చంద్రబాబు, వారికి ₹47,456 కోట్ల బడ్జెట్ కేటాయించామని వెల్లడించారు. చేనేత కార్మికులు, మత్స్యకారుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం కోసం జీఓలు రద్దు చేయడం, గ్రాట్యుటీ అమలు వంటి చర్యలను చేపట్టామని వివరించారు.

యువతకు ఉద్యోగాలు..

తరువాత యువతపై తన ఆశల్ని వ్యక్తపరిచారు. రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రావాలంటే భద్రతే కీలకమని, గత ప్రభుత్వ హయాంలో వ్యాపారవేత్తలు వెనుకంజ వేసినట్టు తెలిపారు. దాన్ని తామిప్పుడు మార్చే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని అన్నారు.

మహానాడు ముగింపు రోజు అన్నదానానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మూడోరోజు ఒక్క రోజులోనే 2 లక్షల మందికి పైగా భోజనం అందించారు. చికెన్ బిర్యానీ ప్యాకెట్లతో పాటు నీటి బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. మొత్తం మూడు రోజుల పాటు దాదాపు 4 లక్షల మందికి వంటకాలు అందించారని నిర్వాహకులు వెల్లడించారు.

ఇదంతా కలిపి టీడీపీ చేపట్టిన మార్పు ప్రయాణానికి మద్దతుగా మహానాడు నిలిచిందని, వచ్చే మహానాడులో భూ సమస్యలపై పూర్తిస్థాయిలో పరిష్కారాలు చూపిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.