అమరావతి: బీజేపీయేతర పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. ఏపీ రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ఏపీ సర్కార్ నిర్వహిస్తున్న ధర్మపోరాట దీక్ష సభకు బీజేపీయేతర పార్టీలను ఆహ్వానించాలని బాబు ప్లాన్ చేస్తున్నారు.

ఏపీ పునర్విభన చట్టాన్ని అమలు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యంగా  వ్యవహరించిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ధర్మ పోరాట దీక్షలను  నిర్వహిస్తున్నారు.

ఈ దీక్షల్లో భాగంగా చివరి దీక్షను విజయవాడ కేంద్రంగా నిర్వహించాలని తలపెట్టారు.ఈ దీక్ష సభకు బీజేపీయేతర పార్టీలను ఆహ్వానించాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.

మంగళవారం నాడు సాయంత్రం అమరావతిలో నిర్వహించిన  టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని పార్టీ నేతలకు వివరించారు.

రాష్ట్రంలో ఇప్పటికే ఏడు ధర్మపోరాట దీక్ష సభలను నిర్వహించారు. ఈ  నెల 10వ తేదీన నెల్లూరులో ధర్మపోరాట దీక్షను నిర్వహించనునన్నారు. ఈ నెల 27వ తేదీన విజయనగరం జిల్లాలో 9వ ధర్మపోరాట దీక్షను నిర్వహిస్తారు. ఆ తర్వాత అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడ ఈ తరహా సభలను నిర్వహిస్తారు.

విజయవాడలో నిర్వహించే ధర్మపోరాట దీక్షలో బీజేపీయేతర పార్టీలను ఆహ్వానించాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్  విపక్ష పార్టీలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ నేత అభిప్రాయపడ్డారు.

తప్పుడు కేసులను బనాయించి విపక్ష పార్టీలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ అభిప్రాయంతో ఉంది. ఇటీవల కాలంలో ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకొన్న ఐటీ సోదాల విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మరోవైపు రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని కూడ ఆయన ఆరోపించారు.

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ మాదిరిగా మంచోడిని కాను: బాబుపై పవన్ నిప్పులు

చంద్రబాబూ..! జాగ్రత్త: నీ రికార్డులు బయటపెడతాం: హరీష్ సంచలనం