అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.  విమానాశ్రయ భద్రత కేంద్రానిదేనని అయితే విచారణ, దర్యాప్తు అధికారం రాష్ట్రానిదేనని చెప్పుకొచ్చారు. ఎన్ఐఏకు అప్పగించడంపై కోర్టులో తేల్చుకుంటామని హెచ్చరించారు చంద్రబాబు. 

జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకి అప్పగించడానికి అసలు మీరెవరంటూ ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నించారు. ఒకప్పుడు ఎన్ఐఏపై నమ్మకం లేదన్న మోదీ ఇప్పుడు ఎన్ఐఏను ఏపీలో దించడం వెనుక ఆంతర్యం ఏంటని నిలదీశారు. ఇష్టం వచ్చినట్లు రాష్ట్ర హక్కులను హరిస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

మోదీ వ్యవహార తీరు చూస్తుంటే రాష్ట్ర హక్కులను హరించేలా ఉందన్నారు. రాష్ట్ర హక్కులను ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసులకు కనీసం ఫిర్యాదు కూడా చేయని వ్యక్తికి కేంద్రం ఎలా ఆశ్రయం‌ ఇస్తుందని నిలదీశారు. 

దాడి జరిగింది ఏపీలో అయితే అక్కడ వ్యవస్థలపై నమ్మకం లేదన్న వ్యక్తి మాటలను ఎలా నమ్ముతారంటూ విమర్శించారు. ఏపీలో ఫిర్యాదు చెయ్యకపోతే పాకిస్థాన్‌, అమెరికా పోయి ఫిర్యాదు చెయ్యాలా అంటూ మండిపడ్డారు. కేంద్రం నచ్చలేదని అమెరికా వెళ్తానంటే ఊరుకుంటారా అంటూ ధ్వజమెత్తారు. 

ఎన్డీఏలో ఉన్నంత వరకు తమను పొగిడిన బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత అవినీతిపరులు అంటూ వ్యాఖ్యానిస్తున్నారని విమర్శించారు. అప్పుడు నీతిమంతులం ఇప్పుడు ఆకస్మాత్తుగా అవినీతిపరులం అయిపోయామా అంటూ విరుచుకుపడ్డారు. 

మోదీపై కూడా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. రఫేల్‌ డీల్ అవినీతిపై ఏం చెప్తారన్నారు. అవినీతి కేసు ఉంది కాబట్టే సీబీఐ డైరెక్టర్ నుంచి అలోక్ వర్మను రాత్రికి రాత్రే మార్పించేశారని ఆరోపించారు. సీబీఐని అస్తవ్యస్తం చేశారని దుయ్యబుట్టారు. అందువల్లే సీబీఐకి సాధారణ సమ్మతిని వెనక్కి తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.75వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జేపీ కమిటీ స్పష్టం చేసిందన్నారు. ఏపీకి నిధులు ఇవ్వడానికి మోదీకి మనసొప్పడం లేదన్నారు. ఏపీకి రావాల్సిన నిధులపై త్వరలో మోదీకి లేఖ రాస్తానని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్! నువ్వేమనుకుంటున్నావ్, తస్మాత్ జాగ్రత్త: చంద్రబాబు వార్నింగ్

కేసీఆర్ చేసిందేమీ లేదు, మాటలు తప్ప: చంద్రబాబు

దివ్యాంగులకు నెలకు రూ.10వేల పింఛన్ :చంద్రబాబు వరాలు