అమరావతి: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. జగన్ నువ్వేమనుకుంటున్నావ్ అంటూ నిలదీశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు వైఎస్ జగన్ రూ.6లక్షల కోట్లు అవినీతి చేశానంటూ పుస్తకాలు వేయిస్తున్నాడని మండిపడ్డారు. 

అవినీతి పరుడు ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. వైఎస్ జగన్ అమలు చేసేది నవరత్నాలు కాదని నవగ్రహాలు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అవినీతి పరుడంటూ విమర్శలు చేస్తున్నాడని అలాగే అధికారంలోకి వస్తే చంద్రబాబుపై విచారణ వేసి జైలుకు పంపుతానని వ్యాఖ్యానిస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. 

జగన్ నువ్వు ఏమనుకుంటున్నావ్ తస్మాత్ జాగ్రత్త అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వ్యాఖ్యలు చూసి ఏపీ ప్రజలు అసహ్యంచుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఎంతో అన్యాయం చేస్తే కనీసం ప్రశ్నించే ధైర్యం లేదు జగన్ కి అంటూ మండిపడ్డారు. 

కేంద్రం రాషట్ర అభివృద్ధికి సహకరించకపోయినా అడగడానికి వైసీపీకి మనసు రావడం లేదన్నారు. ప్రత్యేక హోదా గురించి వైసీపీ కనీసం మాట్లాడటం లేదని మండిపడ్డారు. హోదా అంటే మోదీకి కోపం వస్తుందని జగన్ కు భయం కాబట్టే హోదా గురించి మాట్లాడటం లేదన్నారు. 

జగన్ మెడపై సీబీఐ కత్తి ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ సాయం తీసుకుని ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇద్దరు మోదీలు, ఢిల్లీలో ఉండే మోదీ ముగ్గరూ కలిసి ఎప్పుడు ప్రత్యేక హోదా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

రాజకీయాలు చేయడం కాదు, పరిపాలనా అనుభవం లేని వారు ఉత్తుత్తి హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రూ.200లు పింఛను ఇచ్చి పదేళ్లు చెప్పుకున్నారని తాము పదిరెట్లు పెంచామ్నారు. రైతులకు రుణమాఫీ సాధ్యం కాదని వైసీపీ అంటే తాము చేసి చూపించామని చంద్రబాబు స్పష్టం చేశారు.