విజయవాడ: రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్రంపై పోరాటం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ,జనసేనలు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. చేతనైతే రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని వారికి సూచించారు. కేసుల మాఫీ కోసం కేంద్రంతో కుమ్మక్కయ్యారని ఆయన జగన్‌పై విమర్శలు చేశారు. కేంద్రం చేసిన నమ్మక ద్రోహన్ని నిరసిస్తూ ధర్మపోరాట దీక్షలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది  నూతన గృహా ప్రవేశ కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  గురువారం నాడు ప్రారంభించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుండి  ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్పరెన్స్ ద్వారా బాబు శ్రీకారం చుట్టారు.

పేదలకు స్వంత ఇల్లు  ఉండాలనే ఉద్దేశ్యంతోనే   ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్టు ఆయన చెప్పారు.ఈ గృహాలు పేదలకు ఓ ఆస్తిగా మారుతాయని ఆయన చెప్పారు. ఈ ఇళ్లతో పాటు స్థలం కూడ  మహిళల పేరునే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల ఇళ్లను  రూ.50 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్టు ఆయన చెప్పారు.

ఈ ఇళ్ల సముదాయంలో నివాసం ఉండే వారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.  రెండో విడతలో కూడ మరో 3 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాగితాలకు మాత్రమే ఇళ్లను  నిర్మించిందని చంద్రబాబునాయుడు ఆరోపించారు.

అవినీతి డబ్బుతో పేపర్, టీవి పెట్టి ప్రచారం చేస్తున్నారు.  మీ అనుభవం ఏమిటని జగన్ పై విమర్శలు గుప్పించారు. పరిపాలనా అనుభవం లేని  జగన్ ఏ రకంగా ప్రజలకు పాలనను అందిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్నికల ముందు రాష్ట్రానికి న్యాయం చేస్తోందనే ఉద్దేశ్యంతోనే  బీజేపీతో పొత్తు పెట్టుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాలుగేళ్లు దాటినా కానీ, కేంద్రం సరైన న్యాయం చేయలేదన్నారు. అందుకే బీజేపీతో పొత్తును వదులుకొన్నట్టు చెప్పారు. 

రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందనే భావన ప్రజల్లో ఉందని చంద్రబాబునాయుడు చెప్పారు. బీజేపీ ఏపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై దాడి విషయాన్ని  ఆయన ప్రస్తావిస్తూ చెప్పులతో దాడి చేయకూడదని ఆయన కోరారు.