పోలవరం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోమారు ప్రధాని నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేలో క్రస్ట్ గేట్లను పెట్టే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు  చేసిన బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబుప్రధాని మోదీకి గుజరాత్‌ ప్రాజెక్టులపై ఉన్న మక్కువ పోలవరం పై లేదని వ్యాఖ్యానించారు. 

నరేంద్రమోదీ గుజరాత్ కు ప్రధానమంత్రియా లేక దేశానికి ప్రధానమంత్రా అంటూ సూటిగా ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు. గుజరాత్ లో ప్రాజెక్టులు పరిశీలించేందుకు వెళ్తారు కానీ జాతి గర్వించేలా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తుంటే మాత్రం చూడరా అంటూ విమర్శించారు. ప్రాజెక్టును చూసేందుకు మోదీ ఒక్కసారైనా రాలేదన్నారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యాలంటే రూ.53వేల కోట్లు అవసరమన్న చంద్రబాబు నాయుడు నిధుల విడుదలలో మాత్రం కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. నిధులు విడుదల చెయ్యకుండా ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. 

పోలవరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ప్రాజెక్టుగా గుర్తింపు పొందుతుందని  అలాగే ప్రపంచంలోనే అత్యంత వేగంగా పూర్తైన ప్రాజెక్టుగా కూడా రికార్డు సాధిస్తుందన్నారు. కాంక్రీటు పనులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయని, జనవరి7న గిన్నీస్‌ బుక్‌ రికార్డు సాధించేలా కాంక్రీటపనులు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

జనవరి ఏడున 28 వేలకు పైగా క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేసి ప్రపంచ రికార్డు సృష్టించాలని సంకల్పించినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేసిన ఘనత అధికారులు, ఇంజినీర్లు, నవయుగ సంస్థకు దక్కుతుందన్నారు. 

అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమెలాగో పట్టిసీమతో నిరూపించామని పోలవరాన్ని సకాలంలో పూర్తి చేసి నీరందించడంతోపాటు వందేళ్ల కలను సాకారం చేస్తామన్నారు. నిర్మాణ దశలోనే పోలవరం పర్యాటక ప్రాంతంగా మారిందని, రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతో మంది ప్రాజెక్టును చూసేందుకు వస్తున్నారన్నారు. భవిష్యత్ లో ప్రాజెక్టును టూరిజం హబ్ గా కూడా తీర్చిదిద్దుతామన్నారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ అభివృద్ధికి కేసీఆర్ అడ్డుపడుతున్నాడు: చంద్రబాబు ఆగ్రహం

పోలవరం క్రస్ట్ గేట్ పనులను ప్రారంభించిన చంద్రబాబు