పోలవరం: రాష్ట్ర సాగునీటి చరిత్రలో కీలక ఘట్టం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. 

వందేళ్ల పోలవరం ప్రాజెక్ట్ కలను సాకారం చేసే దిశగా అడుగులేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకమైన గేట్ల ఏర్పాటుకి శ్రీకారం చుట్టారు. 

ప్రాజెక్టు యెుక్క 41వ పిల్లర్ వద్ద రేడియల్ గేట్ స్థాపనకు ప్రారంభం చేశారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టును సాకారం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఒకప్పుడు రాయలసీమ, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో నీరు లేక ఎడారిగా ఉండేదని అలాంటి పరిస్థితి నుంచి తాను ఎంతో మార్పు తీసుకువచ్చినట్లు తెలిపారు. 

పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో గ్రావిటీ ద్వారా నీటిని శ్రీశైలంలో నింపి అక్కడ నుంచి హాంద్రినీవా ద్వారా అనంతపురం జిల్లాకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎడారి ప్రాంతం నుంచి సశ్యామలం చేశానని ఫలితంగా ఎంతో సంతోషం చెందుతున్నట్లు తెలిపారు. 

కేంద్రప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో సహాయ నిరాకరణ చేసిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రూ.24వేల కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. 
  
మే నెలలో రెండు కాలువలను ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఒక కాలువ ద్వారా నీటిని విశాఖ జిల్లా వరకు, మరో కాలువ ద్వారా కృష్ణా జిల్లాలకు గ్రావిటీ ద్వారా నీరు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. 

తొందర్లోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి కరువు అనేది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తైన తర్వాత ఈ ప్రదేశాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. 

ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ లో విలీనం కాకపోతే పోలవరం ప్రాజెక్టు సాకారమయ్యేది కాదన్నారు. రాష్ట్ర విభజన అనంతరం చాలా ఆందోళన చెందానని లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటా అన్న ఆందోళన చెందామని ఆనాడే ఏపీని అభివృద్ధే తన లక్ష్యంగా ప్రతినబూనినట్లు తెలిపారు. 

తనకు ముంపు మండలాలను ఏపీలో విలీనం చెయ్యకపోతే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యనని ప్రధాని నరేంద్రమోదీకి తేల్చి చెప్పానని తన పట్టుదలతో ఆ ఏడు మండలాలలను ఏపీలో విలీనం చేశారని గుర్తు చేశారు. 
 
ప్రపంచంలో అతివేగంగా పూర్తైన ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టు ఉండాలని చంద్రబాబు నాయుడు కోరారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పూర్తైన ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టును తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. 

తాను సీఎం అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పరుగెత్తించానని మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్న ఘనత తనకే దక్కుతుందన్నారు.  

పోలవరం ప్రాజెక్టకు సంబంధించి 63 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని 2019లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమన్న వారికి సమాధానం చెప్పేలా పోలవరం ప్రాజెక్టును నిర్మించి త్వరలోనే పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. 

ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో తొలి రేడియల్ గేటు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 61.43 శాతం పనులు పూర్తి చేసినట్లు తెలిపిన చంద్రబాబు ప్రాజెక్టులో అతి ముఖ్యమైన రేడియల్ గేట్ల నిర్మాణం వేగంగా చేపడుతున్నట్లు తెలిపారు. 

మొత్తం 48 గేట్లను అమర్చాల్సి ఉందని అందులో భాగంగా తొలి గేటును శాశ్వత ప్రాతిపదకన ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు అమర్చనున్నట్లు తెలిపారు. మిగలిన 47 గేట్లు రానున్న రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రాజెక్టు నిర్మాణాధికారులు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా ఒక్కో గేటు ఎత్తు 20.83 మీటర్లు కాగా, వెడల్పు 15.9 అడుగులుగా ఉందన్నారు. మొత్తం గేట్ల తయారీకి 18వేల టన్నుల ఉక్కు అవసరం అవుతందననారు. మొత్తం గేట్ల తయారీ కోసం రూ.530 కోట్ల ఖర్చు కానుందని తెలిపారు. 
 
ఒక్కో రేడియల్ గేటు బరువు 300 టన్నులు ఉందని గేట్లను నిలబట్టడం కోసం హైడ్రాలిక్ సిలిండర్లను వాడనున్నట్లు తెలిపారు. ఒక్కో సిలిండర్ బరువు 250 టన్నులు ఉంటుందన్నారు. ఈ గేట్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. 

ఇప్పటికే కొన్ని హైడ్రాలిక్ సిలిండర్లు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నట్లు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గేట్ల ఏర్పాటు ప్రక్రియలో హైడ్రాలిక్ సిలిండర్లు సహా సెల్ఫ్ లూబ్రికేటింగ్ బూస్టులు కీలకంగా ఉంటాయని చెప్పారు. 
 
రేడియల్ గేట్లను నిలబెట్టడం కోసం ఉపయోగించే ఒక్కో హైడ్రాలిక్ సిలిండర్‌కు 500 టన్నుల బరువును ఎత్తగల సామర్థ్యం ఉంటుందన్నారు. తొలి గేటును ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి చూపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతుల్లో ప్రాజెక్టు పట్ల మంచి అభిప్రాయం వస్తుందని తెలిపారు. 
 
పోలవరం ప్రాజెక్టును 2019 మే నెల చివరి నాటికి పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీటిని అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చంద్రబాబు తెలిపారు. ఈ బహుళార్ధసాధక ప్రాజెక్టు ఎత్తు 129 అడుగులు, పొడవు 9560 అడుగులు అని చెప్పుకొచ్చారు. 

పోలవరం ప్రాజెక్టు పూర్తైతే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందడంతోపాటు చత్తీష్ ఘడ్, ఒరిస్సా రాష్ట్రాలకు కూడా నీరందించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రాజెక్టు ద్వారా 950 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాకుండా సాగు, తాగు నీరు అందించేలా పథక రచన చేస్తున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు నాయుడు తెలిపారు. 

అటు ప్రధాని నరేంద్రమోదీపై చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. జాతి గర్వించపడే ప్రాజెక్టును నిర్మిస్తే సహకరించాల్సిన కేంద్రప్రభుత్వం వివక్ష చూపించిందని ఆరోపించారు. వందేళ్ల కల అయిన ప్రాజెక్టును పూర్తి చేస్తుంటే పరిశీలించాల్సిన మోదీ కనీసం రావడం లేదన్నారు. 

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఇద్దరు ప్రధాన మంత్రులు పరిశీలించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. గుజరాత్ లో ప్రాజెక్టులు పరిశీలించేందుకు ప్రధాని నరేంద్రమోదీకి సమయం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టును పరిశీలించేందుకు తీరిక లేదా అని విమర్శించారు. 

మోదీ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. మోదీ దేశానికి ప్రధానమంత్రినా లేక గుజరాత్ కు ప్రధాన మంత్రినా అని ప్రశ్నించారు. మోదీ వైఖరిలో ఇంకా మార్పురావాల్సిన అవసరం ఉందన్నారు. 

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ పై చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. తాను తెలుగురాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటుంటే కేసీఆర్ మాత్రం ఆంధ్రప్రదేశ్ నష్టపోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. 

పోలవరం ప్రాజెక్టుకు కేసీఆర్ అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ అయిన సందర్భంలోనూ పోలవరం ప్రాజెక్టుపై వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. 

పోలవరం ప్రాజెక్టు విషయంపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని ప్రాజెక్టు పూర్తైతే 5 టీఎంసీల నీరు ఇస్తామని ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ కు విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాలకు నష్టపరిహారం ఇస్తామని వారిని అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కలిసి చర్చించుకుందామని హామీ కోరారు.