హైదరాబాద్: హెరిటేజ్ సంస్థపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పదే పదే హెరిటేజ్ గురించి మాట్లాడుతోందని, హెరిటేజ్ సంస్థ చేసిన తప్పేమిటని ఆయన అన్నారు. ఎఎన్ఐతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. 

నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో హెరిటేజ్ కొంత భూమిని కొనుగోలు చేసిందని, అందులో తప్పు ఏముందని ఆయన అన్నారు. హెరిటేజ్ కంపెనీ కొన్న భూమి క్యాపిటల్ రీజియన్ పరిధిలో లేదని ఆయన చెప్పారు. హెరిటేజ్ వ్యాపార విస్తరణ కోసం దేశంలోని పలు ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేసిందని ఆయన చెప్పారు. 

Also Read: అమరావతి ల్యాండ్ స్కామ్: నిరుపేద రైతు రూ.220 కోట్లతో భూమి కొనుగోలు

దానివల్ల వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏమిటని ఆయన ప్రశ్నించారు. హెరిటేజ్ ఆక్రమాలకు పాల్పడినట్లు రుజువు చేయాలని ఆయన ముఖ్యమంత్రి జగన్ ను డిమాండ్ చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సరస్వతి సిమెంట్స్ కు, తన సొంత మైనింగ్ కంపెనీలకు మేలు చేసే విధంగా స్వార్థపూరిత నిర్ణయాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. 

తాను అధికారంలో ఉన్నప్పుడు హెరిటేజ్ సంస్థకు లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వ పరంగా ఏ విధమైన నిర్ణయం కూడా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలుకు సమాధానం ఏమిటని ప్రశ్నిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అయిందని, అవినీతి జరిగితే ఎందుకు నిరూపించలేకపోయారని అన్నారు. అవినీతికి పాల్పడినట్లు ఏమైనా ఆధారాలున్నాయా అని చంద్రబాబు అడిగారు. 

Also Read: శాసనమండలి పరిణామాలపై గవర్నర్‌‌ను కలిసే యోచనలో బాబు