అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాదులో ఉంటున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే ప్రతి ఒక్కరినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధికారులు క్వారంటైన్ కు పంపిస్తున్నారు. 

హైదరాబాదు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు పార్టీ పోలిట్ బ్యూర్ సమావేశం నిర్వహించారు. హైదరాబాదు నుంచి నిత్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖలు రాస్తున్నారు. మీడియా సమావేశాలు కూడా పెడుతున్నారు. 

ఈ స్థితిలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాలనుకుంటే తప్పకుండా క్వారంటైన్ కు వెళ్లాల్సిందేనా.... ఇదే విషయంపై టీడీపీ, వైసీపీ నాయకులు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. చంద్రబాబు కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలను విమర్శించడంపై మంత్రులు, వైసీపీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి మోపిదేవి వెంకట రమణ చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారు. 

కోవిడ్ -19ను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోందని, హైదరాబాదులో కూర్చుని ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ విమర్శలు చేయడం అర్థరహితమని ఆయన అన్నారు. హైదరాబాదులో కూర్చుని వీడియో కాన్ఫరెన్స్, టెలీ కాన్ఫరెన్స్ ల ద్వారా విమర్శలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. 

దాంతో ఆగకుండా.... ఆంధ్రప్రదేశ్ కు రావాలంటే చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని, ఆ పత్రంతో ఏపీలోకి వచ్చిన తర్వాత 14 రోజుల పాటు క్వారంటైన్ కు వెళ్లాల్సి ఉంటుందని మోపిదేవి అన్నారు. 

మోపిదేవి వ్యాఖ్యలపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రానికి వస్తే క్వారంటైన్ కు వెళ్లాల్సిందేనని మోపిదేవి అంటున్నారని గుర్తు చేస్తూ మరి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి హైదరాబాదు ఎలా వెళ్లారని, అక్కడ ప్రెస్ మీట్ ఎలా పెట్టారని ఆయన ప్రశ్నించారు. సురేష్ తిరిగి రాష్ట్రానికి వచ్చేటప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయనను క్వారంటైన్ కు పంపిస్తుందా అని అచ్చెన్నాయుడు అడిగారు.