కర్నూలు జిల్లా నేతలకు చంద్రబాబునాయుడు ఫుల్లుగా క్లాస్ తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని సిద్ధం చేయటంలో భాగంగా చంద్రబాబు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని నేతలతో సమీక్షలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే మొదటగా కర్నూలు, నంద్యాల నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా రెండు నియోజకవర్గాల్లోని లోపాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు.

రెండు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో నేతల పనితీరు, నేతల మధ్య వివాదాలు, వారిపై వ్యతిరేకత తదితరాపై పూర్తిస్ధాయిలో సమీక్షించారు. ఆ సందర్భంగా పలువురు నేతల వ్యవహారశైలిపై చంద్రబాబు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో గెలుపును దృష్టిలో పెట్టుకుని నేతలందరూ సమైక్యంగా పనిచేయాలని గట్టిగా చెప్పారు. జిల్లాలోని మంత్రులిద్దరూ ఎంఎల్ఏలను, నేతలను కలుపుకుని పోవటం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు.

తన సమీక్ష తర్వాత కూడా జిల్లా నేతల వైఖరిలో ఎటువంటి మార్పు రాకపోతే అందరికీ ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కొంత కాలం పాటు అందరినీ అబ్సర్వ్ చేస్తానని పనితీరు మార్చుకోని వాళ్ళని పక్కన పెట్టేస్తానంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఫిరాయింపు మంత్రి భూమా అఖిలప్రియ వ్యవహారశైలిపై మండిపడ్డారు. తన వైఖరి వల్లే జిల్లాలోని ఎంఎల్ఏలు, నేతలు పార్టీపై తీవ్ర అసంతృప్తి పెంచుకుంటున్నట్లు స్పష్టంగా చెప్పారు.

నియోజకవర్గాల్లోని లోపాలపై చర్చించిన చంద్రబాబు ఆ లొపాలను సరిదిద్దే బాధ్యతను ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూశాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తిపై పెట్టారు. విచిత్రమేమిటంటే, కెఇకి ఫిరాయింపు మంత్రికి ఏమాత్రం పొసగదు. అఖిలకు జిల్లాలోని చాలామంది ఎంఎల్ఏలతో పడదు. సాక్ష్యాత్తు మేనమామ, కర్నూలు ఎంఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డితోనే పడటం లేదు. ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ళగడ్డ, తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నంద్యాలలో చాలా మంది నేతలతో పడదన్న విషయం అందరకీ తెలిసిందే.

మొత్తం మీద కర్నూలు జిల్లా నేతల సమీక్షలో చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. ఈ నేపధ్యంలోనే జిల్లాలోని నలుగురు ఫిరాయింపుల ఎంఎల్ఏలకు టిక్కెట్ల దక్కే విషయం అయోమయంలో పడింది. ఎందుకంటే, అందరి మీద చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎప్పుడైతే కర్నూలు జిల్లా సమీక్ష జరిగిన విధానం తెలిసిందో మిగిలిన జిల్లాల నేతల్లో ఆందోళన మొదలైంది.