పార్లమెంటులో నిరసనకే పరిమితం…

పార్లమెంటులో నిరసనకే పరిమితం…

‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’..అన్న సామెత చంద్రబాబునాయుడుకు సరిగ్గా సరిపోతుంది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత రాష్ట్రంలో తలెత్తిన పరిణామాలు అందరకీ తెలిసిందే. చివరకు భారతీయ జనతా పార్టీతో పొత్తు విచ్చినం చేసుకోవాలి అని నేతలు డిమాండ్ చేసేంత వరకూ పరిస్ధితి వెళ్ళింది. ఈ నేపధ్యంలో చంద్రబాబు అధ్యక్షతన ఎంపిలు, మంత్రులు, ఎంఎల్ఏ, నేతలతో కీలక సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటలపాటు సమావేశం వాడివేడిగా సాగింది.

అయితే చివరకు తేల్చింది ఏమిటంటే, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్లమెంటులో నిరసన తెలపాలని. విభజన హామీల అమలు, పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలట. ప్రజల వ్యతిరేకతను పార్లమెంటు వేదికగా కేంద్రప్రభుత్వానికి గట్టిగా తెలియజేయాలట. పార్లమెంటు నుండి సస్పెండ్ అయినా పర్వాలేదు కానీ నిరసన మాత్రం గట్టిగా వినిపించాలని చంద్రబాబు ఎంపిలకు దిశానిర్దేశం చేశారట.

అదే విషయాన్ని సమావేశం తర్వాత కేంద్రమంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ, పొత్తు విచ్చిత్తిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. అమరావతి, పోలవరంకు నిధులు ఇవ్వకపోవటం, విభజన హామీలు అమలు కాకపోవటం తదితరాలపై పూర్తిస్ధాయిలో చర్చించాలని తమ అధ్యక్షుడు ఆదేశించారని సుజనా చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించేందుకు తాము చివరి వరకూ కేంద్రంపై ఒత్తిడి పెడుతూనే ఉంటామన్నారు. పొత్తుల విషయమై తమ అధ్యక్షుడి ఆదేశాల మేరకు తాము నడుచుకుంటామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

ఇపుడు సుజనా చెప్పిందే నిజమనుకుంటే, గడచిన మూడున్నరేళ్ళుగా ఎంపిలు ఏమి చేస్తున్నట్లు? విభజన హామీల అమలు, రాష్ట్రప్రయోజనాల కోసం ఎంపిలు కేంద్రప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు? సభలో నిరసనలు, ఆందోళనలు చేయాలని చంద్రబాబు ఇపుడే చెప్పడమేంటి? పార్టీలకతీతంగా బడ్జెట్ ను అందరూ వ్యతిరేకిస్తున్న విషయం చంద్రబాబుకు ఇపుడే తెలిసిందా? ప్రతీ బడ్జెట్లోనూ ఏపికి కేంద్రం అన్యాయమే చేస్తున్న విషయం చంద్రబాబుకు అంతమాత్రం తెలీదా?

ఇపుడే ఇంత హడావుడి ఎందుకంటే? త్వరలో వస్తున్న ఎన్నికలే సమాధానం అని చెప్పక తప్పదు. ఇప్పటికే చంద్రబాబు పాలనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. ఏ విషయంలోనూ కేంద్రాన్ని నిలదీయలేని స్ధితిలో ఉన్న చంద్రబాబు చేతకానితనంపై జనాలు మండిపడుతున్నారు. భాజపాతో పొత్తు వల్ల నష్టం తప్పదని చంద్రబాబు గ్రహించారు. అందుకనే ప్రజా వ్యతిరేకతను కేంద్రంపై మళ్ళించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగమే ఈరోజు జరిగిన డ్రామా.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page