అమరావతి: తమ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ మృతికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. శివప్రసాద్ తనకు చిరకాల మిత్రుడని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని హామీల అమలు కోసం రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. 

శివప్రసాద్ మృతి చిత్తూరు జిల్లాకు మాత్రమే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రానికే లోటు అని చంద్రబాబు అన్నారు. శివప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు సీనియర్ నేతలను కోల్పోవడం తమ పార్టీకి తీరని లోటు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇటీవల తెలుగుదేశం పార్టీ నేత, శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణించిన విషయం తెలిసిందే. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ శివప్రసాద్ ను చంద్రబాబు శుక్రవారం పరామర్శించారు. శివప్రసాద్ ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని ఆయన ఆ సందర్భంలో చెప్పారు. 

శివప్రసాద్ మృతికి టీడీపి నేత నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. సినీ కళాకారుడిగా, నాయకుడిగా ప్రజల హృదయాలు గెలుచుకున్నారని ఆయన కొనియాడారు. టీడీపి బలోపేతానికి శివప్రసాద్ ఎంతో కృషి చేశారని అన్ారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు వేదికగా పోరాటం చేశారని ఆయన చెప్పారు. శివప్రసాద్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సంబందిత వార్తలు

హోదా ఉద్యమంలో శివప్రసాద్ స్పెషల్ రోల్: దేశం దృష్టిని ఆకర్షించిన మాజీ ఎంపీ

చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

శివప్రసాద్ సినీ కెరీర్.. చెరగని ముద్ర!