హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయంలో తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటంలో మాజీ ఎంపీ శివప్రసాద్ ప్రత్యేక పాత్ర పోషించారు. స్వతహాగా నటుడు అయిన శివప్రసాద్ పలు వేషధారణలతో కేంద్రంపై తన నిరసన వ్యక్తం చేశారు.

పార్లమెంట్ వేదికగా పలు వేషాలు ధరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతను దేశమంతటికి తెలయజేశారు. పార్లమెంట్ ఆవరణలో శివప్రసాద్ చేసిన పోరాటానికి దేశవ్యాప్తంగా పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. 

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ వేసే వేషాల్లో ఎంతో గూడర్థం దాగి ఉండేది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలకు తగ్గుట్లుగా వేషధారణ వేసి అందర్నీ ఆలోచింపచేశారు. అంతేకాదు తిట్టనవసరం లేకుండానే తన వేషధారణతో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించారనడంలో ఎలాంటి సందేహం లేదు. 

పవిత్ర గ్రంథాలైన రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలలో మోసాలు, కుట్రలు వంటి పాత్రధారుల వేషాలు వేస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు. ఏపీని ప్రధాని మోదీ నమ్మించి మోసం చేశారంటూ పదేపదే ఆరోపించేవారు. మోదీ, కేంద్రప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆయన వేసే ఓక్కో వేషానికి ఓక్కో ప్రాధాన్యత ఉండటంతో అంతా ఆయన వేషాలపైనే చర్చించుకునేవారు. 
 
తెలుగుదేశం పార్టీ ఎంపీలంతా పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులతో నిరసన తెలుపుతుంటే శివప్రసాద్ మాత్రం గారడీ వేషధారణతో నిరసన తెలిపేవారు. గారడి వేషధారణలో పార్లమెంట్‌ ఆవరణలో నిరసనకు దిగుతూ అందరి మన్నలను పొందారు.  

పొట్టకూటి కోసం మాయలు చేసే వాడు గారడీ వాడైతే ..మోదీ ఓట్లు, పదవుల కోసం మాయలు చేసేవాడంటూ ఘాటు విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంటూ మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని మాయమయ్యారని ఎంపీ శివప్రసాద్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. 

శివప్రసాద్ విచిత్ర వేషధారణలతో తెలుపుతున్న నిరసనలకు యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ముగ్ధురాలయ్యారు. సాక్షాత్తు శివప్రసాద్ దగ్గరకు వచ్చి అభినందించారు. ఆయనతో కలిసి ఓ సెల్పీ సైతం తిరగడం విశేషం. 

ప్రముఖ నటుడు ఎంజీఆర్, డీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు కరుణానిధి వేషధారణలతో దేశప్రజల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. మెుత్తానికి ప్రత్యేక హోదా ఉద్యమంలో తనదైన మాటల తూటాలతో కేంద్రం, ప్రధాని మోదీపై తిట్ల దండకాన్ని దండుకున్నారు. అంతేకాదు కవితలు, పద్యాలు, జానపద గేయాలతో కేంద్రం తీరును ఎండగట్టిన శివప్రసాద్ ఇప్పటికీ ఎప్పటికీ ఉద్యమకారుల మనస్సుల్లో నిలిచిపోతారని ఆయన అభిమానులు చెప్తున్నారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత