సాగరమాల కార్యక్రమం కింద దేశంలో కొత్తగా అభివృద్ధి చేయడానికి తలపెట్టిన 91 రోడ్డు, 83 రైల్‌ ప్రాజెక్ట్‌లలో ఆంధ్రప్రదేశ్‌కు 32 రోడ్డు, 21 రైల్‌ ప్రాజెక్ట్‌లు కేటాయించినట్లు కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రి  మన్సుఖ్‌ మాండవీయ తెలిపారు.

రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పోర్టులకు సరకుల రవాణాను వేగవంతం, సులభతరం చేసే ప్రక్రియలో భాగంగా రోడ్డు, రైల్‌ ప్రాజెక్ట్‌లు చేపట్టినట్లు మంత్రి చెప్పారు.

Also Read:నదుల అనుసంధానంపై విజయసాయి ప్రశ్న: ముసాయిదా సిద్ధమైందన్న కేంద్ర మంత్రి

రోడ్డు ప్రాజెక్ట్‌లలో కొన్ని పూర్తయ్యాయి. మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. మరికొన్ని డీపీఆర్‌ రూపకల్పన దశలో ఉన్నాయని ఆయన వివరించారు. రైల్‌ ప్రాజెక్ట్‌లలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు చెప్పారు.

అలాగే విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. సాంప్రదాయ పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధితో ఒక పథకాన్ని ప్రారంభించినట్లు గడ్కరీ రాజ్యసభలో తెలిపారు.

ఈ పథకంలో భాగంగా ఖాదీ, కాయర్‌, విలేజ్‌ ఇండస్ట్రీస్‌ ఆధ్వర్యంలో సాంప్రదాయక పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసి అందుకు తగిన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు గడ్కరీ వెల్లడించారు.

Also Read:ఏపీ శాసనమండలి సెలెక్ట్ కమిటీ: పేర్లిచ్చిన టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు (కలంకారీ ఉత్పాదనలు), విజయనగరం (కాయర్‌ పరుపుల తయారీ), చిత్తూరు (కాయర్‌ ఉత్పాతదనలు), కృష్ణా (కొండపల్లి బొమ్మలు), తూర్పు గోదావరి (జొన్నాడ ఫుడ్‌ ప్రాసెసింగ్‌), చిత్తూరు (చింతపండు ఉత్పాతదనలు), గుంటూరు (మంగళగిరి బంగారు ఆభరణాల తయారీ), తూర్పు గోదావరి (కొబ్బరి నార ఉత్పాదనలు), తూర్పు గోదావరి (కడియపులంక కొబ్బరిపీచు ఉత్పాదనలు) జిల్లాల్లో మొత్తం 9 సాంప్రదాయ పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు.