పోలవరంపై చంద్రబాబు మాటలన్నీ డొల్లేనా ?

పోలవరంపై చంద్రబాబు మాటలన్నీ డొల్లేనా ?

పోలవరంపై చంద్రబాబునాయుడు చెబుతున్న మాటలన్నీ ఒట్టి డొల్లే అని తేలిపోయింది. ప్రాజెక్టుపై తమ భేటీ సందర్భంగా కేంద్రమంత్రి గడ్కరీ పూర్తి భరోసా ఇచ్చారంటూ చంద్రబాబు ఒకవైపు చెప్పుకుంటున్నారు. భూసేకరణ, పునరావాసంపై పూర్తి వ్యయాన్ని కేంద్రమే భర్తిస్తుందని కేంద్రమంత్రి తనకు హామీ ఇచ్చారంటూ చంద్రబాబు చెప్పారు. అయితే, సీన్ ఇంకో విధంగా ఉంది. ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన సవరించిన అంచనాలు రెజెక్ట్ అయ్యింది. మొత్తం రూ. 58,319 కోట్లతో పంపిన సవరించిన అంచనాలు సమగ్రంగా లేవంటూ కేంద్రం తిప్పికొట్టింది. అంతేకాకుండా ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం రాష్ట్రప్రభుత్వానికి 12 ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పమంటూ నిలదీసినంత పనిచేసింది. దాంతో సమస్య మళ్ళీ మొదటికొచ్చినట్లైంది.

పోలవరం కుడి, ఎడమ కాలువ పనులకు 2015-16 లెక్కలతో పోలిస్టే 2013-14 లెక్కలు ఎందుకు ఎక్కువున్నాయని ప్రశ్నించింది. 2017-18 అంచనాల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంతవుతుంది? అసలు ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి అయ్యే వ్యయం ఎంత ? అదే విధంగా ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటే పెట్టుబడి-లాభం నిష్పత్తి ఏ స్ధాయిలో ఉంటుందో కూడా లెక్కలు గట్టి చెప్పాలని స్పష్టం చేసింది.

ప్రధాన డ్యాం, కుడి, ఎడమ కాలువలో జరిగిన మొత్తం పని పరిణామం, పూర్తవ్వాల్సిన పని పరిణామానికి ఖర్చెంతవుతుంది? అంచనాలు విడివిగా లెక్కలు కట్టి పంపాలని చెప్పింది. ప్రాజెక్టులో విద్యుత్కేంద్రం నిర్మాణానికి తాజాగా వేసిన అంచనా వ్యయం ఎంతో చెప్పమంది. అంచనాలను కూడా రాష్ట్రం నేరుగా కేంద్రానికి పంపటం కాకుండా పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా తనిఖీ చేయించి తర్వాత తమకు పంపాలంటూ స్పష్టం చేయటం గమనార్హం.

కేంద్రం వేసిన ప్రశ్నలు చూస్తేనే ఎవరికైనా అర్ధమవుతుంది చంద్రబాబు-గడ్కరీ మధ్య జరిగిన చర్చలు ఎంత చక్కగా జరిగాయో. ఎందుకంటే, మొదటి నుండి ప్రాజెక్టు ఖర్చుల విషయంలో రాష్ట్రప్రభుత్వం చెబుతున్న లెక్కలను కేంద్రం నమ్మటం లేదు. పైగా కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్రప్రభుత్వం సరైన లెక్కలు చెప్పటం లేదనే ఆరోపణలున్నాయి. ఇటువంటి నేపధ్యంలో వేల కోట్ల రూపాయలను ప్రాజెక్టు విడుదల చేయాలని చంద్రబాబు చెబితే కేంద్రం ఎందుకు విడుదల చేస్తుందన్నది ప్రధాన సందేహం. చూడబోతే పోలవరం కష్టాలు చంద్రబాబును అంత తేలిగ్గా వదిలేట్లు లేవు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos