బడ్జెట్ తదనంతర పరిణామాలతో ఒకవైపు టిడిపి పార్లమెంటులో ఆందోళన చేస్తుండగానే మరోవైపు కేంద్రం తాజాగా చంద్రబాబుకు మరో షాక్ ఇచ్చింది. విశాఖపట్నం నగర అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న రూ. 100 కోట్లను నిలిపేసింది. ‘అమృత్ పథకం’లో భాగంగా దేశంలోని పలు నగరాల అభివృద్ధికి ఏటా కేంద్రం నిధులు ఇస్తుంది. అందులో భాగంగానే విశాఖ అభివృద్ధికి రూ. 100 కోట్లు ఇస్తోంది.

అయితే, ఇక నుండి కేంద్రం నుండి విశాఖ అభివృద్ధికి నిధులు మంజూరు చేయబోయేది లేదంటూ కేంద్రం రాష్ట్రప్రభుత్వానికి సమాచారం ఇచ్చిందట. దాంతో చంద్రబాబుకు మరింత మండుతోంది. అయితే, నిజానికి ఇందులో కేంద్రం తప్పిదమేమీ లేదు. అమృత్ పథకంలో నగరాల అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు రావాలంటే కచ్చితంగా పాలకవర్గం ఉండితీరాలి.

విశాఖపట్నం నగర పాలక సంస్ద కాలపరిమితి తీరిపోయి ఇప్పటికి 6 సంవత్సరాలైంది. చంద్రబాబు వచ్చిన దగ్గర నుండి విశాఖపట్నం కార్పొరేషన్ కు ఎన్నికలు నిర్వహించటం లేదు. అధికారులు ఎంత చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదు. నిధుల విడుదల విషయంలో కేంద్రం కూడా రాష్ట్రప్రభుత్వాన్ని పలుమార్లు హెచ్చరించింది. అయినా ఉపయోగం కనబడలేదు. దాంతో కేంద్రం విశాఖపట్నం అభివృద్ధికి నిధులను నిలిపేసింది.