ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్లపై ఇచ్చిన కౌంటర్  పిటిషన్ లో సీబీఐ కీలక అంశాలను ప్రస్తావించింది. హాజరు మినహాయింపు కోసం జగన్ పిటిషన్లు విచారణార్హం కాదని తేల్చి  చెప్పింది. బెయిల్ షరతులను జగన్ అతిక్రమిస్తున్నారని ఆరోపించింది.

కోర్టు హాజరు నుంచి ఏదో ఒక కారణంతో బయటపడాలని ప్రయత్నిస్తున్నారని.. రాజకీయ, ధన బలాన్ని ఉపయోగించి సాక్షులను జగన్ ప్రభావితం చేస్తారని స్పష్టం చేసింది. మొదటి చార్జ్‌షీట్ దాఖలై 8 ఏళ్లయినా ఇప్పటికీ విచారణ ప్రారంభం కాలేదని కౌంటర్‌లో పేర్కొంది. 

జగన్‌, ఇతర నిందితులు ఏదో ఒక నెపంతో విచారణ ప్రక్రియను జాప్యం చేస్తున్నారని తెలిపింది. జాప్యం జరుగుతోందంటూ జగనే మినహాయింపు కోరుతున్నారని చెప్పింది. తీవ్రమైన ఆర్థిక కుంభకోణాన్ని దృష్టిలో ఉంచుకొని.. జగన్‌కు హాజరు మినహాయింపు ఇవ్వొద్దని తెలిపింది. 

సీఎం అయిన తర్వాత జగన్‌ ఒక్కసారే సీబీఐ కోర్టుకు హాజరయ్యారని.. సీబీఐ కోర్టులో జగన్‌ హాజరు మినహాయింపు తీసుకుంటూనే ఉన్నారని ప్రస్తావించింది. సహేతుక కారణంగా లేకుండానే మినహాయింపు కోసం మళ్లీ పిటిషన్ వేశారని తెలిపింది. జగన్‌ హోదా మారిందన్న కారణంగా మినహాయింపు ఇవ్వరాదని పేర్కొంది. 

Also Read రాజ్యసభలో జగన్ కేసుల ప్రస్తావన: విజయసాయి అభ్యంతరం, ఛైర్మన్ మండిపాటు...

సీబీఐ, ఈడీ కలిపి వేసిన 16 చార్జ్‌షీట్లలో జగన్‌ నిందితుడిగా ఉన్నారని తెలిపింది. నేర విచారణ నిందితుల సమక్షంలో జరగాలని సీఆర్‌పీసీ చెబుతోందని.. చట్ట రూపకర్తలు కూడా చట్టానికి లోబడే ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేసింది. 

కేసు నమోదైనప్పటి నుంచి జగన్ రాజకీయాల్లోనే ఉన్నారని.. సీఎం అయినంత మాత్రాన కేసు పరిస్థితులు మారినట్లు కాదన్నారు. హాజరు మినహాయింపు కోరడం నిందితుల హక్కు కాదని.. కోర్టు విచక్షణ పరిధిలోకి వస్తుందని తెలిపింది. ప్రజా విధుల్లో ఉన్నంత మాత్రాన హాజరు మినహాయింపు కోరడం ఆర్టికల్ 14కు విరుద్ధమని తెలిపింది. చట్టం ముందు జగన్ సహా పౌరులందరూ సమానమేనని.. జగన్ పిటిషన్లపై ఏప్రిల్ 9న హైకోర్టులో విచారణ జరుపుతామని తెలిపింది.