Asianet News TeluguAsianet News Telugu

మొదలైన వేట

ఒకేరోజు ఇద్దరు ప్రముఖులపై కేంద్ర సంస్ధలు దాడులు చేయటమంటే చిన్న విషయం కాదు. దాడులకు, ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు ఏమన్నా లింక్ ఉందేమో. ప్రతిపక్షాల్లో ప్రముఖులపై దాడులు చేయించి కేసులు నమోదు చేయిస్తే వచ్చే ఎన్నికల నాటికి వారిక నోరెత్తేందుక ఉండదు.

Cbi and it conducts raids on premises of Chidambaram and lalu

వేట మొదలైంది. ఎన్డీఏ వ్యతిరేక పార్టీల జాతీయస్ధాయి ప్రముఖ నేతలపై  దాడులు మొదలయ్యాయి. ఈరోజు ఉదయం తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి ఎం. చిదంబరంతో పాటు ఆర్జీడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇళ్ళపై ఏకకాలంలో సిబిఐ, ఐటి దాడులు జరగాయి. చిదంబరం ఇంటితో పాటు కొడుకు కార్తీ చిదంబరం ఇంటిపైన కూడా సిబిఐ దాడులు చేసింది. ఇక లాలూ ఇంటిపైన ఆదాయపు పన్నుశాఖ అధికారులు 100 మంది ఏకకాలంలో దాడులు చేసారు.

చిదంబరంకు చెందిన తమిళనాడులోని ఇళ్ళపైనే కాకుండా ఢిల్లీ, నోయిడాలోని నివాసాలతో పాటు కార్యాలయాలను కూడా కలుపుకుని మొత్తం 14 చోట్ల సిబిఐ దాడులు చేసింది. సరే, దాడులను ఎలాగూ చిదంబరం ప్రతీకార దాడులుగా అభివర్ణిస్తున్నారు లేండి అదివేరే సంగతి.

విదేశీ పెట్టుబడులను అనుమతించేందుకు ఇంద్రాణీ ముఖర్జీకి చెందిన ఏఎన్ఎక్స్ మీడియా నుండి కార్తీ చిదంబరం లంచం తీసుకున్నారన్నది ఆరోపణలు. ఈ ఆరోపణలపై తండ్రి, కొడుకులిద్దరిపైనా ఎఫ్ఐఆర్ నమోదవ్వటంతో సిబిఐ దాడులు చేసింది. చిదంబరంపై ఇంకా అనేక ఆరోపణలున్నాయి.

ఇక, లాలూ ఇంటిపైన కూడా ఆదాయపు పన్నుశాఖకు చెందిన 100 మంది అధికారులు దాడులు జరిపారు. ఢిల్లీ, గుర్గావ్, పాట్నాతో పాటు 22 చోట్ల ఐటి ఉన్నతాధికారులు దాడులు చేసి విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు వెయ్యి కోట్లరూపాయల భూ అక్రమ ఒప్పందాలు చేసుకున్నారన్నది లాలూ కుంటుంబంపై ఉన్న ఆరోపణలు.

లాలూ కుమార్తె మీసా భారతి, ఇద్దరు కొడుకులపైన కూడా ఆరోపణలున్నాయి. లాలూ కుమార్తె, కుమారులు వెయ్యి కోట్ల విలువైన భూములను రాయించుకున్నారంటూ ఇటీవలే కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన ఆరోపణల నేపధ్యంలో ఐటి దాడులు చేయటం గమనార్హం.

గడచిన మూడేళ్ళల్లో ఇటు సిబిఐ గానీ అటు ఐటి అధికారులు గానీ  ప్రతిపక్షాలకు చెందిన ప్రముఖ నేతలపై చెప్పుకోతగ్గ దాడులు చయలేదు. ఒకేరోజు ఇద్దరు ప్రముఖులపై కేంద్ర సంస్ధలు దాడులు చేయటమంటే చిన్న విషయం కాదు. దాడులకు, ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు ఏమన్నా లింక్ ఉందేమో. ప్రతిపక్షాల్లో ప్రముఖులపై దాడులు చేయించి కేసులు నమోదు చేయిస్తే వచ్చే ఎన్నికల నాటికి వారిక నోరెత్తేందుక ఉండదు. అంటే ముందుముందు మరింతమంది నేతలపై దాడులు తప్పవేమో.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios