అవినీతి అక్రమాలకు  పాల్పడుతున్న అధికారుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. కేవలం మూడున్నర సంవత్సర కాలంలో పదుల సంఖ్యలో అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కారు. దొరికిన ప్రతి అధికారి దగ్గర   వందల కోట్లు దొరుకుతున్నాయి. ఏసీబీ సోదాల్లో నోట్ల కట్టలు కుప్పలుతెప్పలుగా బయటపడుతున్నాయి. ప్రజల సొమ్ముని అడ్డుదారుల్లో మింగేస్తున్నారు.

ఈ మధ్య కాలంలోనే చాలామంది అక్రమార్కులను అధికారులు బయటపెట్టారు. కొద్ది రోజుల క్రితం అనంతపురానికి చెందిన ఐసీడీఎస్  అధికారి వెంకట నారాయణ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు జరపగా రూ.50కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు. అంతకముందు గుంటూరులో ఆర్ అండ్ బీ ఎస్ఈ రాఘవేంద్రరావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు జరిపితే.. అతని, అతని బంధువుల ఇళ్లల్లో కోట్ల ఆస్తులు దొరికాయి. మొన్నటికి మొన్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ రఘు ఇంట్లో, అతని బినామీల ఇళ్లల్లో సోదాలరు చేస్తే.. రూ.500కోట్లకుపైగానే ఆస్తులు లభించాయి. అంతేకాదు కేజీలకొద్ది బంగారు ఆభరణాలు దొరికాయి. ఇలాంటి అవినీతి అనకొండలు ఇంకా చాలా మందే ఉన్నారు.  

 ఈ అవినీతి బకాసురులను పట్టుకునేందుకు ఏసీబీ అధికారులతో ఇప్పుడు సీబీఐ అధికారులు కూడా జతకట్టారు. అవినీతిపరుల భరతం పట్టడానికి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లడానికి ఉభయ శాఖల అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం విజయవాడలోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో వారు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏసీబీ డిజి ఆర్పీ ఠాకూర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అవినీతి నిర్మూలనకు తీసుకోవాల్సిన పలు అంశాలపై చర్చించారు.

ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరిగిన కేసుల వివరాలపై సమీక్ష నిర్వహించారు. అవినీతిని అంతం చేయడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చ జరిగింది. ఏసీబీ, సీబీఐ అధికారులు ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, అధికారులకు ఉండాల్సిన దర్యాప్తు మెలకువలు ఏమిటి అనే అంశాలపై సుదీర్ఘ చర్చ సాగింది. అవినీతి కేసులలో కీలకంగా మారుతున్న బినామీలను ఏ విధంగా గుర్తించాలి, కేసులో అవసరమైతే సహనిందితులను సాక్షులుగా ఉపయోగించుకోవాలనే అంశం గురించి సీనియర్‌ అధికారులు సూచనలు చేశారు. ముఖ్యమైన కేసులకు సంబంధించి పలుకుబడిగల ఉన్నతోద్యోగుల విషయంలో ఎదురయ్యే న్యాయపరమైన అంశాలపైనా ప్రధానంగా చర్చ సాగింది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆధునిక పరికరాలను ఏ విధంగా వినియోగించుకోవాలి, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులకు ఏ విధంగా శిక్షలు పడేలా చేయోచ్చనే దానిపైనా సీనియర్‌ అధికారులు కొన్ని సలహాలు ఇచ్చారు. ఈ సమావేశంలో సిబిఐ హైదరాబాద్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎవైవి కృష్ణతో పాటు పలువురు ఏసీబీ, సీబీఐ అధికారులు పాల్గొన్నారు.