అమరావతి:  ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌పై విచారణను క్యాట్ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. దేశ ద్రోహానిికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఐపఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును  ఏపీ ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ రాత్రి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తనను సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు  ఈ నెల 13వ తేదీన క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం నాడు విచారణ జరిగింది.  సస్పెన్షన్‌ చట్ట విరుద్దమని ప్రకటించాలని  క్యాట్‌ను ఏబీ వెంకటేశ్వరరావు కోరారు. 

Also read:రాజకీయ ఒత్తిళ్ల వల్లనే...: క్యాట్ ను ఆశ్రయించిన ఏబీ వెంకటేశ్వర రావు

సస్పెన్షన్‌పై స్టే విధించాలని   ఏబీ వెంకటేశ్వరరావు  క్యాట్‌ను కోరారు.  అయితే స్టే విధించేందుకు మాత్రం క్యాట్ అంగీకరించలేదు. ఈ కేసు విచారణను  ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. 

ఏపీ ప్రభుత్వం తరపున దేశాయి ప్రకాష్ రెడ్డి ఈ పిటిషన్‌పై వాదించారు.  డీజీపీ స్థాయి అధికారిని కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా ఎలా సస్పెండ్ చేశారని  క్యాట్  ప్రశ్నించింది. 

ఈ విషయమై తమకు వారం రోజుల పాటు సమయం ఇవ్వాలని  ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది క్యాట్‌ను కోరారు. 2019 మే నెల నుండి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎందుకు జీతం ఇవ్వలేదో చెప్పాలని  క్యాట్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.