అమరావతి: తనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై నిఘా విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు క్యాట్ ను ఆశ్రయించారు. తనను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన జీవోను ఆయన సవాల్ చేశారు. ఐదు రోజుల క్రితం ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వర రావును సస్పెండ్ చేసింది.

రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తనను సస్పెండ్ చేశారని ఆయన ఫిర్యాదు చేశారు. తనను సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని ఆయన అన్నారు. నిరుడు మే 31వ తేదీ నుంచి తనకు వేతనం కూడా చెల్లించడం లేదని ఆయన చెప్పారు. సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టేయాలని ఆయన తన పిటిషన్ లో కోరారు.

ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ జగన్ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వర రావును సస్పెండ్ చేసింది. పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ గా ఉన్నప్పుడు వెంకటేశ్వర రావు భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో చెప్పారు 

Also Read: నేనేం వాడుకోలేదు: ఏబీ వెంకటేశ్వర రావు తనయుడు చేతన్ సాయికృష్ణ స్పందన ఇదీ..

ఏబీ వెంకటేశ్వర రావు పోలీసు ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్స్ నిబంధనలను ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లంఘించారని ప్రభుత్వం ఆరోపించింది. అంతే కాకుండా దేశ భద్రతకు సంబంధించిన పలు కీలకమైన విషయాలను బహిర్గతం చేసినట్లుగా కూడా చెప్పింది. 

ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్, ఇండియన్ ప్రొటోకాల్ ఒకే విధమైన ప్రామాణికాలను కలిగి ఉంటాయని, దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి రావడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ దాటి వెళ్లేందుకు వీలు లేదని ప్రభుత్వం ఆయనను ఆదేశించింది.

Also Read: నిజమా?: బాబుతో కలిసి కుట్ర, కుమారుడికి ఏబీ వెంకటేశ్వర రావు కాంట్రాక్ట్

1989 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వర రావును ప్రజా ప్రయోజనాల రీత్యా సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. డీజీపీ స్థాయి అధికారి అయిన ఏబీ వెంకటేశ్వర రావుకు గత 8 నెలలుగా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు.