అనంతపురం:  తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనపై అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు మరో 30 మంది టీడీపీ నేతలూ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. 

కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి సోమవారంనాడు హైదరాబాదు నుంచి తాడిపత్రికి చేరుకున్నారు.  ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. దాంతో వారంతా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: కడప జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి: నేరుగా హైదరాబాద్‌కి ప్రయాణం

పోలీసు 30 యాక్టును జేసీ ప్రభాకర్ రెడ్డి ఉల్లంఘించారని పోలీసులు ఆరోపించారు. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి ఏ విధమైన స్పందన కూడా లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై వరుసగా కేసులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసులో జెసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్ రావడంతో ఆగస్టులో కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన నేరుగా కడప నుంచి హైదరాబాదు చేరుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ సమయంలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 

Also Read: జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా: బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం

హైదరాబాదులో ఆయన కరోనాకు చికిత్స తీసుకున్నారు. సోమావరంనాడు ఆయన తాడిపత్రి చేరుకున్నారు.