పోలీసు బలగాల భద్రత మధ్య మావోయిస్టుల బంద్ ప్రశాంతంగా ముగిసినట్లే. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు స్వచ్చంధంగా బంద్ పాటించారు. అయితే, వైజాగ్ లాంటి నగరంలో మావోయిస్టులకు మద్దతుగా వాల్ పోస్టర్లు వెలవటం ఒకింత ఆందోళన కలిగించేదే
మావోయిస్టులు తలపెట్టిన ఐదు రాష్ట్రాల బంద్ భారీ భద్రత మధ్య ప్రశాంతంగా ముగిసింది. ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దుల్లో పోయిన నెల 24వ తేదీన జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు ఏపి, తెలంగాణా, మహారాష్ట్ర, ఒడిస్సా, ఛత్తీస్ఘర్ రాష్ట్రాల్లో బంద్ కు పిలుపినిచ్చిన సంగతి అందరికీ విధితమే.
పేరుకు ఐదు రాష్ట్రాల్లో బంద్ అయినప్పటికీ ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలోని విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా, ఛత్తీస్ ఘర్, తెలంగాణాలోని మారుమూల ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుదనటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అందుకే ఐదు రాష్ట్రాల పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.
ఎన్ కౌంటర్ ఘటనా స్ధలమైన విశాఖపట్నం జిల్లా, ఒడిస్సా సరిహద్దులని కూడా అందరికీ విధితమే. దాంతో గడచిన పది రోజులుగా భారీ ఎత్తున గ్రేహౌండ్స్ పోలీసు దళాలు పెద్ద ఎత్తున ఏజెన్సీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. దాంతో గురువారం కూడా విశాఖ, ఒడిస్సా సరిహద్దు ప్రాంతాలైన అరకు, పాడేరు, చింతపల్లి, సీలేరు లాంటి ఏజెన్సీ మండలాలన్నీ పోలీసు దళాల గాలింపు చర్యలతో అట్టుడికిపోయింది.
అటవీ ప్రాంతాల్లో వేలాది మంది పోలీసులు ముందుజాగ్రత్తగా మోహరించారు. అయినా, పై ప్రాంతాల్లోని జనజన స్రవంతిపై బంద్ ప్రభావం బాగానే పడింది. వ్యాపారాలు, వర్తక, వాణిజ్య సముదాయాలకు తోడు రవాణా వ్యవస్ధ కూడా స్ధంబించింది. దాంతో బందోబస్తు మధ్య బంద్ ప్రశాంతంగానే జరిగింది.
నగర ప్రాంతాల్లో ఎటు తిరిగీ బంద్ ప్రభావం ఏమాత్రం ఉండదన్న సంగతి పోలీసులకు బాగానే తెలుసు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే గురువారం బంద్ సందర్భంగా విశాఖపట్నం, విజయనగరం నగరాల్లో కూడా మావోయిస్టులకు మద్దతుగాను, బంద్ లో పాల్గొనాల్సిందిగాను కోరుతూ మావోయిస్టుల పేరుతో వాల్ పోస్టర్లు వెలవటం గమనార్హం.
అయితే ఎన్ కౌంటర్ కు ప్రతీకారంగా మావోయిస్టులు త్వరలో ఏదో సంచలనానికి పూనుకుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకనే విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన రాజకీయ పార్టీల నేతలు, ఇప్పటికే మావోయిస్టుల లక్ష్యంలో ఉన్న నేతలందరూ మైదాన ప్రాంతాలకు చేరుకున్నా ఎప్పుడేమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
