విజయవాడ: గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు వల్లనే తమ పార్టీ సీట్లు 124 నుంచి 104కు పడిపోయాయని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ కు రాజకీయ పరిపక్వత లేదని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో అన్నారు. 

ప్రధాని మోడీ, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా రాసిచ్చిన స్క్రిప్టును పవన్ కల్యాణ్ చదువుతున్నాడని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపి గాలికి జనసేన, బిజెపి, వైసిపి కొట్టుకుపోతాయని ఆయన అన్నారు. బిజెపి నేత జీవీఎల్ నరసింహారావు పవర్ బ్రోకర్ అని, ఎపిలో ఆయనకు అడ్రసే లేదని బుద్దా వెంకన్న అన్నారు. 

కడప ఉక్కు కర్మాగారాన్ని అడ్డుకుంది తమ పార్టీ కాదని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని స్పష్టం చేశారు. అవాస్తవాలు మాట్లాడితే పవన్ కల్యాణ్ ను ప్రజలు దూరం పెడుతారని ఆయన వ్యాఖ్యానించారు.