అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కోవిడ్‌19 నివారణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బ్రిటిష్‌ హైకమిషనర్‌ జాన్‌ థాంప్సన్ ప్రశంసించారు. కరోనా లక్షణాలున్న వారికి టెస్టులు నిర్వహించడం, ట్రేసింగ్‌లో జగన్ సర్కార్ అద్భుతంగా పనిచేసి అదే స్థాయిలో ఫలితాలను కూడా రాబడుతోందన్నారు బ్రిటీష్ హైకమీషనర్. 

బ్రిటిష్‌ దౌత్యాధికారులతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భారత్‌లో బ్రిటిష్‌ తాత్కాలిక హై కమిషనర్‌ జాన్‌ థాంప్సన్, డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ ఈ వీడియో కాన్పరెన్స్ లో పాల్గొన్నారు. కోవిడ్‌ నివారణా చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై సీఎం జగన్ తో వీరు చర్చించారు. 

వీడియో కాన్ఫరెన్స్‌లో బ్రిటిష్‌ హైకమిషనర్ మాట్లాడుతూ... కోవిడ్‌ లాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలోని దేశాలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.  భారత్‌–యూకేలు రెండూ కూడా కోవిడ్‌ను ఎదుర్కొనే విషయంలో కలిసి పనిచేస్తున్నాయని... పరిశోధనలు, వ్యాక్సిన్‌ తయారీ,  ఔషధాల తయారీలో పరస్పరం సహకరించుకుంటున్నాయని అన్నారు. వ్యాక్సిన్‌ యూకేలో తయారవుతోందని... భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. 

read more   విజయవాడ దుర్గగుడి ఈవో సహా మరో 18 మందికి కరోనా

''ఏపీలో ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం.  భారీగా టెస్టులు చేయడంలో, పాజిటివ్‌ కేసులను గుర్తించండంలో ఆంధ్రప్రదేశ్‌ విశేషంగా పనిచేస్తోంది. అలాగే కోవిడ్‌ వల్ల మరణాలు రేటు పూర్తిగా అదుపులో ఉండడం ప్రశంసనీయం. టెలీమెడిసిన్‌ లాంటి కొత్త విధానాలు ముందుకు తీసుకెళ్తున్నారు. వైద్య, విద్య, ఆరోగ్య రంగాల్లో ఏపీ ప్రభుత్వం మంచి చర్యలను తీసుకుంటోంది'' అని ప్రశంసించారు. 

''ఏపీ మెడ్‌ టెక్‌జోన్‌తో ఇటీవలే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. కోవిడ్‌ నివారణకోసం వాడే వైద్య పరికరాల తయారీకి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. ఈ విషయంలో స్టార్టప్‌ కంపెనీలను యూకే ప్రోత్సహిస్తుంది. కరోనా విపత్తును ఎదుర్కోనే ప్రక్రియలో కలిసి ముందుకు సాగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంగ్లండ్‌కు చెందిన నేషనల్‌ హెల్త్‌మిషన్‌ భాగస్వామం 108, 104 లాంటి అంబులెన్స్‌ల నిర్వహణలో ఉత్తమ పద్ధతులు, టెక్నాలజీలకు దారితీస్తుంది'' అని పేర్కొన్నారు. కోవిడ్‌ పరిస్థితులు సద్దుమణిగాక బ్రిటన్‌ రావాల్సిందిగా సీఎం జగన్‌ను బ్రిటిష్‌ హైకమిషనర్‌ ఆహ్వానించారు.