దివంగతులు బొత్స గురునాయుడు, ఈశ్వరమ్మ, మజ్జి రామారావు, కళావతి జ్ఞాపకార్థం మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు, కుటుంబ సభ్యులు రామతీర్థంలో వెలిసిన సీతారాముల వాహనాల కోసం విరాళం అందించారు.
విజయనగరం: ఉత్తరాంధ్రలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం రామతీర్ధంలోని సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామనవమి పర్యదినాన్ని పురస్కరించుకొని సీతారాముల కల్యాణం బుధవారం కన్నుల పండువగా జరిగింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కొద్దిమంది అధికారులు, ముఖ్యుల మధ్య ఆలయ పూజారులు కల్యాణాన్ని సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తిలకించే అవకాశాన్ని కల్పించారు.
ఆలయ సంప్రదాయానుసారం అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీ సీతారామస్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. సింహాచల వరాహ నరసింహస్వామి ఆలయం అందజేసిన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అందజేశారు. విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధానార్చకులు సాయిరాం ఆచార్యుల ఆధ్వర్యంలో ఆలయ పురోహితులు స్థానాచార్యులు, నరసింహాచార్యలు, పురోహితులు కిరణ్, టిటిడి వేద పండితులు కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీతారామలక్ష‌్మణ స్వాముల వాహనాల తయారీ కోసం బొత్స కుటుంబం రూ.14.50 లక్షల భారీ విరాళాన్ని అందజేసింది. దివంగతులు బొత్స గురునాయుడు, ఈశ్వరమ్మ, మజ్జి రామారావు, కళావతి జ్ఞాపకార్థం మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు కుటుంబ సభ్యులు సీతారాముల వాహనాల కోసం విరాళం అందించారు. ఇక లక్ష్మణస్వామి వాహనానికి బొత్స కుమార్తె సోమి సత్యశ్రీ అనూష, భరత్ కుమార్ దంపతులు విరాళాన్ని అందజేశారు. ఈ సొమ్ముతో శ్రీరామచంద్రమూర్తికి గరుడ వాహనం, లక్ష్మణస్వామికి అశ్వ వాహనం, సీతాదేవికి హంస వాహనాన్ని, ఆలయ అధికారులు బంగారు తాపడంతో తయారు చేయించనున్నారు.
read more కరోనా ఎఫెక్ట్: భక్తులు లేకుండానే భద్రాద్రి రాములోరి కళ్యాణం
తమ కుటుంబం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను, విరాళపు సొమ్మును అందజేసిన అనంతరం బొత్స ఝాన్సీలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ... సీతారామస్వామి వారు ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. రామతీర్ధం ఆలయాన్ని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆమె అన్నారు. కోవిడ్ కారణంగా, భక్తులను ఈ ఏడాది అనుమతించనప్పటికీ, సంప్రదాయభద్దంగా సీతారాముల కల్యాణాన్ని రమ్యంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. భద్రాచలం ఆలయ తరహాలో శ్రీరామ నవమి రోజునే ఇక్కడ కూడా కల్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఝాన్సీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ ఆర్‌జెసి, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ఇఓ బ్రమరాంబ, ఆర్‌డిఓ బిహెచ్ భవానీ శంకర్, దేవాదాయ శాఖ డీసీ శాంతి, రామతీర్ధం ఆలయ ఇఓ బివివి ప్రసాదరావు, పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఇఓ కిషోర్ కుమార్, రాజమన్నార్ దేవస్థానం ఇఓ రమణ, నెల్లిమర్ల తాశీల్దార్ జి.రాము, మున్సిపల్ వైస్ ఛైర్మన్ సముద్రపు రామారావు తదితరులు పాల్గొన్నారు.
