తాడేపల్లి: అమరావతి భూ కుంభకోణంపై విచారణ మీద హైకోర్టు స్టే ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. న్యాయ వ్యవస్థపై తమకు గౌరవం ఉందని, రాజ్యాంగబద్దంగానే తమ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అంటూనే ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

అమరావతిలో భారీ కుంభకోణం జరిగిందని ఆయన గురువారం మీడియా సమావేశంలో అన్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ బినామీలతో దోచుకున్నారని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే అమరావతి అక్రమాలపై విచారణ జరిపిస్తామని తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చెప్పామని ఆయన గుర్తు చేశారు. 

Also Read: బాబుకి ఊరట: అమరావతి భూముల వ్యవహారంలో సిట్ ఏర్పాటుపై హైకోర్టు స్టే

దుశ్చర్యలపై, అక్రమాలపై విచారణ జరగకూడదంటే ఎలా అని ఆయన అడిగారు. ఇందిరా గాంధీ, జయలలితలపై విచారణ జరిగిన సందర్భాలను ఆయన గుర్తు చేశారు. అమరావతి భూముల కుంభకోణంపై విచారణ జరపకూడదని హైకోర్టు చెప్పిన విషయంపై చర్చ జరుగుతోందని ఆయన చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

దేశంలో చాలా కుంభకోణాలు జరిగాయని, కానీ ఇప్పటి వరకు అమరావతి భూముల విషయంలో ఇచ్చిన ఉత్తర్వుల వంటివాటిని చూడలేదని ఆయన అన్నారు.  ఎవరి ప్రయోజనాల కోసం హైకోర్టులో పిల్ వేశారని, సొంత పార్టీ ప్రయోజనాల కోసం పిల్ వేస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. పెద్దవాళ్ల పేర్లు మీడియాలో రావద్దు గానీ పేదవాళ్ల పేర్లయితే రావచ్చునా అని ఆయన ప్రశ్నించారు. 

Also Read: అలా చేస్తున్నారు: కోర్టులపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ప్రజాధనం దోచుకుంటుంటే వత్తాసు పలకడం సమంజసం కాదని ఆయన అన్నారు. అవినీతిని చూస్తూ ఊరుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంపై విచారణ జరగకూడదని చెప్పడం సరి కాదని ఆయన అన్నారు.