అమరావతి:  అమరావతి భూముల విషయంలో అవినీతిని వెలికితీసేందుకు  సిట్ ఏర్పాటు, మంత్రివర్గ సంఘం ఏర్పాటుపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది.

అమరావతిలో భూముల కొనుగోళ్లలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  అమరావతి భూముల కొనుగోలులో గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికితీసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం సుమారు 4 వేలకు ఎకరాల్లో టీడీపీకి చెందిన నేతలకు భూములు ఉన్నట్టుగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

ఈ విషయమై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు రెవిన్యూ అధికారులను అరెస్ట్ చేసింది సిట్. రెవిన్యూ అధికారులు అరెస్ట్ కావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. 

also read:రాజధాని భూముల స్కాం: మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు సహా 12 మందిపై ఏసీబీ కేసు

అమరావతి పరిసర ప్రాంతాల్లో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు భూములు కొనుగోలు చేశారని గుర్తించిన ఏసీబీ ఆయనతో పాటు మరో 12 మందిపై ఈ నెల 15వ తేదీన కేసు నమోదు చేసింది.

ఏపీ ప్రభుత్వం అమరావతి భూముల విషయంలో సిట్ ఏర్పాటు, మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటును సవాల్ చేస్తూ  టీడీపీ నేతలు వర్ల రామయ్య, మాజీ మంత్రి ఆలపాటి రాజా లు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ విషయమై మంత్రివర్గ ఉప సంఘం, సిట్ తదుపరి చర్యలు తీసుకోవద్దని కోరుతూ ఏపీ హైకోర్టు బుధవారం  నాడు స్టే ఇచ్చింది.