అమరావతి భూ కుంభకోణంలో ఎఫ్ఐఆర్‌లో ఉన్న సమాచారాన్ని మీడియాలో ప్రసారం చేయొద్దంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

ఏపీలో న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అనంతరం పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. చట్టం ముందు అందరూ సమానులేనన్న సూత్రాన్ని విస్మరించి న్యాయవ్యవస్థ పక్షపాతంతో వ్యవహరిస్తోందన్నారు.

తాను ఏ న్యాయమూర్తికి ఉద్దేశాలు ఆపాదించడం లేదని అసాధారణ పరిస్ధితుల్లో మాత్రమే నిషేధం విధిస్తారని విజయసాయిరెడ్డి చెప్పారు. న్యాయస్థానాలు మీడియా నోరు నొక్కుతున్నాయని.. పౌరుల ప్రాథమిక హక్కులను విస్మరిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్మాన్ని కాపాడాల్సిన వారే పక్షపాతంతో  వ్యవహరిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తాజా వివాదంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వైసీపీ ఎంపీ డిమాండ్ చేశారు.

మరో ఎంపి మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానిని, అందరినీ కలిసి పరిస్థితిని వివరిస్తామని చెప్పారు. అభివృద్ధి పనులకు కూడా కోర్టులు అడ్డుపడుతున్నాయని.. న్యాయ వ్యవస్థలో కొందరి వల్ల ఈ పరిస్ధితి ఎదురైందని మిథున్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కుంభకోణాల దర్యాప్తునకు కోర్టులు అడ్డుపడటం వింతగా ఉందన్నారు.