విజయనగరం: విజయనగరం జిల్లా వైసీపీ సమన్వయకర్త చిన్న శ్రీను అరెస్ట్ వ్యవహారంపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేల పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. 

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారంపై డీజీపీ, సిఈవోలను కలవనున్నట్లు తెలిపారు. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని వైసీపీని అణిచి వెయ్యాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని బొత్స ఆరోపించారు. 

విజయనగరం జిల్లాలో వైసీపీ నేతల అరెస్ట్ పై స్పందించిన ఆయన నిప్పులు చెరిగారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కుమిలి నియోజకవర్గంలో ముగ్గురు యువకులు ఓటర్ల లిస్ట్ పట్టుకుని ట్యాబ్ లతో వచ్చి ప్రభుత్వ అధికారులమని చెప్తూ ఓటర్ల సర్వే నిర్వహిస్తున్నారని టీడీపీకి అనుకూలంగా వారు ప్రజలను అడుగుతుంటే స్థానికులకు అనుమానం వచ్చిందని చెప్పారు. 

ముగ్గురు యువకులను స్థానికులు పోలీసులకు అప్పగించారని స్పష్టం చేశారు. పోలీసులే ట్యాబ్ లను జిల్లా సమన్వయకర్త చిన్న శ్రీనుకి అందజేశారని మళ్లీ ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వేల పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. 

అరెస్ట్ చేసిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు తక్షణమే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. మరోవైపు విజయనగరం జిల్లాలో వైసీపీ నేతల అరెస్ట్ పర్వం కొనసాగుతోంది. ఉదయం పార్టీ జిల్లా సమన్వయకర్త చిన్న శ్రీనుని అరెస్ట్ చేసిన పోలీసులు జామి పోలీస్ స్టేషన్ కి తరలించారు. 

ఆయనతోపాటు పతివాడ అప్పలనాయుడు, అశ్విని కుమార్, సన్యాసినాయుడు, బుర్లే శ్రీనులను పోలీసులు అరెస్ట్ చేసి గుర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. అటు అరెస్ట్ లపై జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంంది. నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. తమ నేతలను విడుదల చెయ్యకపోతే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించింది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

విజయనగరంలో వైసీపీ నేత చిన్న శ్రీను అరెస్ట్