ప్రజావేదిక కూల్చివేతతోనే సీఎం జగన్ పాలన మొదలైందని టీడీపీ నేత బొండా ఉమా విమర్శించారు. సీఎం జగన్ ఇంటి పునాదులు కదలడంతోనే.. టీడీపీ నేతల ఇళ్లు కూల్చివేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజావేదిక కూల్చివేతతోనే సీఎం జగన్ పాలన మొదలైందని టీడీపీ నేత బొండా ఉమా విమర్శించారు. సీఎం జగన్ ఇంటి పునాదులు కదలడంతోనే.. టీడీపీ నేతల ఇళ్లు కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. ‘‘జగన్ ఇవాళ మీది.. రేపు మాది’’ అని అన్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాతుడ్రు ఇంటి వెనకాల గోడను కూల్చివేయడంపై బొండా ఉమా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనతో ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు. చంద్రబాబు పర్యటనకు వచ్చిన జనాన్ని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని.. అందుకే టీడీపీ నేతల ఇంటి గోడలు కూల్చివేస్తున్నారని ఆరోపించారు.
తాడేపల్లి ఆదేశాలను అధికారులు పాటిస్తున్నారని.. అధికారం ఉందని కొందరు రెచ్చిపోతున్నారని విమర్శించారు. వెల్లంపల్లి అవినీతిని ప్రశ్నిస్తే ఓ సామాన్యుడిని అరెస్ట్ చేయిస్తారా అని ప్రశ్నించారు. అయ్యన్నను అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ వేధింపులకు భయపడేది లేదని చెప్పారు.
మరోవైపు అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేతపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. అయ్యన్నపై జగన్ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు.
ఆదివారాన్ని విధ్వంస దినంగా మార్చారని విమర్శించారు. పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
Also Read: జనం తరఫున మాట్లాడటమే అయ్యన్న చేసిన తప్పా..?: అధికారుల తీరుపై అయ్యన్నపాత్రుడి కుటుంబ సభ్యుల ఆగ్రహం
ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఇంటిని పోలీసులను చుట్టుముట్టారు. నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను తెల్లవారుజామున మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. పంట కాల్వను అక్రమించి గోడ నిర్మించారని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. ఈ క్రమంలోనే అయ్యన్న ఇంటి వెనకాల ఉన్న గోడను మన్సిపల్ సిబ్బంది జేసీబీతో కూల్చివేశారు. మరోవైపు అయ్యన్న ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. మీడియాను కూడా లోనికి అనుమతి ఇవ్వడం లేదు. అయ్యన్నపాత్రుడి ఇంటివైపు వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి టీడీపీ నేతలు అయ్యన్న ఇంటి వద్దకు చేరుకోకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు అయ్యన్న ముఖ్య అనుచరుడు వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరికొందరు అయ్యన్న అనుచరులు, టీడీపీ కార్యకర్తలను పోలీసులు ముందస్తు జాగ్రత్తగా అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో నర్సీపట్నంలో హై టెన్షన్ నెలకొంది.
