నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను మున్సిపల్ సిబ్బంది కూల్చివేయడంపై ఆయన కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పుడుతుందని అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను మున్సిపల్ సిబ్బంది కూల్చివేయడంపై ఆయన కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పుడుతుందని అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కుట్రపూరితంగా కూల్చివేతలకు పాల్పడుతుందని అయ్యన్నపాత్రుడి సతీమణి పద్మావణి ఆరోపించారు. ప్రభుత్వం అయ్యన్న గొంతు నొక్కాలని చూస్తోందన్నారు. జనం తరఫున మాట్లాడటమే అయ్యన్న చేసిన తప్పా అని ఆమె ప్రశ్నించారు. బీసీలుగా పుట్టడమే తమ నేరమా అని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ నిలిపివేసి తెల్లవారుజామునే అధికారులు కూల్చివేతలకు దిగారని చెప్పారు. నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూల్చివేస్తే తాము ఎక్కడ ఉండాలన్నారు. మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం తమను వేధిస్తుందన్నారు. కక్ష రాజకీయాలతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 

మరోవైపు అధికారుల తీరుపై అయ్యన్న చిన్న కొడుకు రాజేష్ మండిపడ్డారు. తాము మున్సిపల్ కమిషన్ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాకే నిర్మాణాలు చేపట్టినట్టుగా తెలిపారు. న్యాయంగా ఇల్లు కట్టుకున్నామని.. అయితే ఒక్కసారిగా ఇలా కూల్చివేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. అయితే తాము అక్రమ నిర్మాణం కావడంతోనే గోడను కూల్చివేతను చేపట్టారు. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని.. ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఇంటిని పోలీసులను చుట్టుముట్టారు. నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను తెల్లవారుజామున మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. పంట కాల్వను అక్రమించి గోడ నిర్మించారని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. ఈ క్రమంలోనే అయ్యన్న ఇంటి వెనకాల ఉన్న గోడను మన్సిపల్ సిబ్బంది జేసీబీతో కూల్చివేశారు. మరోవైపు అయ్యన్న ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. మీడియాను కూడా లోనికి అనుమతి ఇవ్వడం లేదు. అయ్యన్నపాత్రుడి ఇంటివైపు వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి టీడీపీ నేతలు అయ్యన్న ఇంటి వద్దకు చేరుకోకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు అయ్యన్న ముఖ్య అనుచరుడు వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరికొందరు అయ్యన్న అనుచరులు, టీడీపీ కార్యకర్తలను పోలీసులు ముందస్తు జాగ్రత్తగా అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో నర్సీపట్నంలో హై టెన్షన్ నెలకొంది. 

అయ్యన్న అరెస్ట్‌కు రంగం సిద్దం..!
అయితే గత కొంతకాలంగా అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులపై చేస్తున్న వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనపై కేసులు కూడా నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడిపై మొత్తంగా 12కు పైగా కేసులు ఉన్నాయి. ఆయనపై నిర్బయ కేసు కూడా ఉంది. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. ఇటీవల చోడవరంలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో మంత్రి రోజా, పోలీసులతో పాటుగా సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. 

గత కొంతకాలంగా అయ్యన్నను అరెస్ట్ చేస్తారనే వార్తల నేపథ్యంలో.. ఆదివారం తెల్లవారుజామున ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించడం చర్చనీయాంశంగా మారింది. అక్రమ నిర్మాణం కూల్చివేత నేపథ్యంలో పోలీసులు మోహరించారా? లేక ఏదైనా కేసులో అరెస్ట్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే దీనిపై పోలీసుల వైపు నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.