చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కంకర రాళ్ల క్వారీలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. చౌడేప‌ల్లి మండ‌లం క‌డియాలకుంట గ్రామంలో ఏపీ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్ఆర్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీ కంక‌ర రాళ్లలో పనులు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో క్వారీ నుంచి దూసుకొచ్చిన రాయి త‌గ‌ల‌డంతో ఓ వ్య‌వ‌సాయ కూలీ చ‌నిపోయాడు. ఈ క్వారీకి స‌మీపంలోని తోట‌లో మామిడి కాయ‌లు కోసేందుకు కొందరు కూలీలొచ్చారు. వీరు మామిడితోట‌లో కాయ దింపుతుండగా క్వారీలో పేలుడు జ‌రుగుతుంద‌ని నిర్వాహకులు వీరికి స‌మాచారం ఇచ్చారు.

Also Read:మామిళ్లపల్లి పేలుడు కేసు: జగన్ కుటుంబంలో అరెస్ట్ కలకలం.. పోలీసుల అదుపులో వైఎస్ ప్రతాపరెడ్డి

దీంతో కూలీలు ట్రాక్ట‌ర్‌లో బ‌య‌లుదేరుతున్న స‌మ‌యంలోనే క్వారీలో పేలుడు జ‌రిగి ఓ రాయి వేగంగా దూసుకు వ‌చ్చింది. అది జహీర్ అనే కూలీకి బ‌లంగా త‌గ‌ల‌డంతో అత‌ను అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.