Asianet News TeluguAsianet News Telugu

అమరావతి మీద ఇంత అర్భాటమా... బిజెపి ఎమ్మెల్సీ వీర్రాజు చీకాకు

ఎన్నోకొత్తరాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఎక్కడా రాజధాని గురించి ఇంత అర్భాటం కనిపించలేదు

BJPs somu virraju critical of Naidus new capital hype

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో ఎందుకింత హడావుడి చేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. శనివారం నాడు ఆయన మీడియా పిచ్చాపాటి లో టీడీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

ఇపుడున్న సచివాలయం సచివాలయం కాదా, అసెంబ్లీ అసెంబ్లీ  కాదా అని ఆయన ప్రశ్నించారు.

 

దేశంలో కొత్తగా అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ఏ ఒక్క రాష్ట్రం కూడా రాజధాని నిర్మాణం మీద  ఇంత హంగామా,అర్బాటం  చేయలేదని అన్నారు. టిడిపి ప్రభుత్వం ధోరణిని వీర్రాజు తొలినుంచి వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఈ మధ్య కొద్ది రోజులుగా ఆయన మౌనంగా ఉన్నారు. మళ్లీ  మాట్లాడటం ఇదే.

 

 ఈరోజు శాసన సభ్యుల కోసం ఇపుడు తాజాగా లండన్  కంపెనీ తయారుచేసిన నమూనాల మీద అసెంబ్లీలో  ప్రజంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత  రెండేండ్లుగా రాజధాని అంటే ఎలాఉంటుందో చూపిస్తూ సింగపూర్ వాళ్లు కట్టించిన గాలిమేడల స్థానంలో ఇపుడు లండన్ కు చెందిన పోస్టర్ అండ్ పార్ట్ నర్స్ వాళ్లనమూనాలు  వస్తున్నాయి. గ్రాఫిక్స్ కూడా స్పష్టంగా లేని ఈ నమూనాల గురించి ప్రజలు అభిప్రాయం చెప్పాలనడం వింతగా ఉందని ఆయన అన్నారు.

 

భారతదేశంలో ఎన్నో గొప్ప నిర్మాణ సంస్థలుంటే తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం రాజధాని ఎవరు కడతారా  అని మూడేండ్లుగా  ప్రపంచమంతా వెదుకుతూ పోతున్నదని ఆయన వ్యాఖ్యానించారు.

 

ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌ను ఆ రాష్ట్ర హౌసింగ్ బోర్డే కట్టిందని, ఇక్కడి ప్రభుత్వం మాత్రం సింగపూర్, జపాన్ అంటూ హడావుడి చేయడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

 

ఇదంతా కేవలం పత్రికల్లో ప్రచార పటాటోపానికే అన్నట్లు ఉందని ఆయన చెప్పారు.



టీడీపీ వల్లే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ గెలిస్తే.. మరి మిగిలిన చోట్ల టీడీపీ ఎందుకు ఓడిపోయిందని సోము వీర్రాజు సూటిగా ప్రశ్నించారు. అధికార పార్టీకి తమ బీజేపీ ఇప్పుడు కొత్తిమీర కట్టలా కనిపిస్తోందన్నారు. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో తమను కనీసం సంప్రదించకుండా వదిలేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

బీజేపీ  నాయకులను, కార్యకర్తలను టీడీపీ కొత్తిమీరలా చూస్తున్నదని వీర్రాజు విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమని కనీసం సంప్రదించలేదని చెబుతూ , ‘మేము మోదీ - బాబు ఫొటోలతో ఎన్నికల  ప్రచారానికి వెళితే  టీడీపీవాళ్లు  చంద్రబాబు ఫొటోతోనే ఎన్నికలకు వెళ్లారు. మోదీ బొమ్మ వారు వాడుకోవడం లేదు,’ అని  సోమువీర్రాజు తెలిపారు. టిడిపి వల్లే బిజెపి గెలిచిందనడం పట్ల ఆయన అభ్యంతరం చెప్పారు. ‘ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వల్లే బిజెపి గెలిస్తే.. మిగిలిన చోట్ల టీడీపీ ఎందుకు ఓడిపోయిందో సెలవిస్తారా,’ అని  సోము వీర్రాజు అడిగారు.

Follow Us:
Download App:
  • android
  • ios