రాజ్యాంగాన్ని సీఎం అవహేళన చేస్తున్నారు.. సోము వీర్రాజు

రాజ్యాంగాన్ని సీఎం అవహేళన చేస్తున్నారు.. సోము వీర్రాజు

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. బుధవారం రాజమండ్రిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారన్నారు.కేంద్రం నుంచి రక్షించాలన్న చంద్రబాబు వ్యాఖ్యలతో ప్రజలు నివ్వెరపోతున్నారని ఆయన అన్నారు.  ఈ నాలుగేళ్లలో గవర్నర్ చంద్రబాబుని చాలా సార్లు ప్రశంసించారన్నారు. గడిచిన నాలుగేళ్లుగా గవర్నర్‌ను ఏమీ అనని చంద్రబాబు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్ధంగావడం లేదని వీర్రాజు అన్నారు.

ముఖ్యమంత్రి పదవిలో ఉండి.. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తారా అని సందేహం వ్యక్తం చేశారు. ప్రజలు తనను రక్షించాలని ముఖ్యమంత్రే స్వయంగా అడిగితే.. ఇక ప్రజలను ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. రాజ్యాంగంపై అసలు చంద్రబాబుకి గౌరవముందా అని అడిగారు.రాష్ట్రాన్ని కేంద్రం అనేక విధాలుగా ఆదుకుంటోందని గవర్నర్ చెప్పారని సోమువీర్రాజు గుర్తు చేశారు. గవర్నర్ పై విమర్శలు చేయడానికి కారణమేంటన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను మేనేజ్ చేసే  అలవాటు ఉందా అని ప్రశ్నించారు. వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటుంటే.. మీకు ఇబ్బందిగా ఉందా అని సీఎంని ప్రశ్నించారు.

పథకాల గురించి చెప్పాల్సిన సభలో ప్రజల నుంచి సీఎం రక్షణ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలోని వనరులను ప్రభుత్వం సరిగా వినియోగించడం లేదని విమర్శించారు. బీజేపీతో మిత్రపక్షంలో ఉన్నప్పుడే తమ కార్యకర్తలపై అనంతపురంలో కేసులు పెట్టారని ఆయన గుర్తు చేశారు.
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos