అవినీతికి సంబంధించి చంద్రబాబునాయుడుపై ఇంతకాలం వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలనే తాజాగా బిజెపి కూడా చేస్తోంది. 

చంద్రబాబునాయుడును గతంలో ఇంతలా ఎవరూ వెంటాడలేదేమో? అందరికీ తెలుసు చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభించక ముందు ఆయనకున్న ఆస్తి రెండెకరాలేనని. ఎందుకంటే, ఆ విషయాన్ని స్వయంగా చంద్రబాబే చెప్పుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఆస్తులు, అవినీతి గురించి ఎప్పుడు చంద్రబాబు కేంద్రంగా చర్చ జరిగినా అందరూ ప్రస్తావించేంది రెండకెరాల ఆసామి అనే. అంతకన్నా లోతుల్లోకి ఎవరూ వెళ్ళలేదు.

సరే ప్రస్తుత విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ ఎంఎల్సీ సోము వీర్రాజు మాత్రం చంద్రబాబును వెంటాడుతున్నారు. ఆదివారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ, రెండెకరాల చంద్రబాబు లక్షకోట్ల రూపాయలు ఎలా సంపాదించారంటూ పెద్ద బాంబే పేల్చారు. పెద్ద బాంబు అని ఎందకనాల్సి వచ్చిందంటే అవే ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి చేయటం మామూలే. కానీ మిత్రపక్షమైన భాజపా నేత అన్నపుడు ఆరోపణలకు బలం వస్తుంది.

ఇపుడదే చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారింది. వీర్రాజు తాజాగా మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు గురించి చెప్పాల్సింది చాలా ఉందని వీర్రాజు అన్నారు. టీడీపీ నేతలు అవినీతికి వారసులంటూ వ్యాఖ్యానించిన సోము వీర్రాజు చంద్రబాబు గురించి తాను కేవలం వాస్తవాలే చెప్పినట్లు సమర్థించుకున్నారు. కానీ ఆ వాస్తవాలను కొందరు జీర్ణించుకోలేక ప్లాన్ చేసి తన ఆఫీసు వద్ద ఆందోళన చేయిస్తున్నట్లు మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ముంటే తన ప్రశ్నలకు జవాబు చెప్పాలని సవాల్ విసిరారు.

రెండెకరాల రైతునని చెప్పుకునే చంద్రబాబుకు లక్షల కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయో అందరికీ తెలుసన్నారు. ఏదో ఓ సాకుతో బెదిరిస్తే తాను భయపడే రకం కాదని స్పష్టం చేశారు. కేవలం రాష్ట్రంలో జరిగే అన్యాయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు తెలియనివ్వకుండా ఉంచాలని టీడీపీ దుష్ట ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.