బిజెపి శాసనసభాపక్ష నేత విష్ణకుమార్ రాజు టిడిపిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ, టిడిపిలో కిరాయిహంతకులున్నట్లు మండిపడ్డారు. రూ. 5 లక్షలిస్తే హత్యలు చేసే వాళ్ళు టిడిపిలో ఉన్నారంటూ మండిపడ్డారు. రూ. 10 లక్షలిస్తే తనను కూడా చంపేస్తారంటూ పెద్ద బాంబే పేల్చారు. ఇంతకీ విష్ణు ఎవరి గురించి అలా మాట్లాడారు?

విషయం ఏమిటంటే, ప్రధానమంత్రి నరేంద్రమోడిని కించపరిచేలా టిడిపి వైజాగ్ ఎంల్ఏ వాసుపల్లి గణేష్ పెద్ద హోర్డింగ్ పెట్టారు. అందులో మోడికి వ్యతిరేకంగా స్టోగన్లున్నాయి. దానిపైనే విష్ణు తీవ్రంగా స్పందించారు. హత్య కేసులో నేరస్తునిగా ఉన్న ఎంఎల్ఏ ప్రధానకి వ్యతిరేకంగా ఫ్లెక్సీ పెట్టి నిరసన తెలపటం ఏంటంటూ ధ్వజమెత్తారు.

ప్రధానిని కించపరుస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు వెంటనే గణేష్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ కూడా చేశారు. ఇదే విధంగా టిడిపి రెచ్చగొడుతుంటే తాము కూడా త్వరలోనే నోరు విప్పి నిజాలు మాట్లాడాల్సుంటుందని హెచ్చరించటంపై ఇపుడు సర్వత్రా చర్చ మొదలైంది.