అమరావతి: ఏపీ రాష్ట్రంలో  అధికారంలోకి రావడం అంత సులభం కాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అభిప్రాయపడ్డారు.

మంగళవారం నాడు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందన్నారు. ఈ స్థానాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉందని ఆయన పార్టీ నేతలకు చెప్పారు. 

also read:పోరు షురూ: జగన్ మీద సోము వీర్రాజు తీవ్ర అవినీతి ఆరోపణలు

సోము వీర్రాజు మరింత పటిష్టంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పటిష్ట నాయకత్వంతో బీజేపీ ముందుకెళ్తోందన్నారు. రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదగాలనేదే లక్ష్యమని ఆయన చెప్పారు.

సంస్థాగతంగా పార్టీని పటిష్టపర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరారు. ఏపీలో పార్టీ బలోపేతానికి పక్కా ప్రణాళికలు రచిస్తున్నామని రామ్ మాధవ్ ప్రకటించారు.

రాష్ట్ర ప్రజల కోసం బీజేపీ బలమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారాయన.పార్టీకి అధ్యక్షుడు ఎవరుండాలో కూడ తేల్చుకోలేని స్థితిలో దేశంలో కొన్ని పార్టీలున్నాయని ఆయన విమర్శించారు.

కన్నాను అధ్యక్షుడిగా తీసి సోము వీర్రాజును పెట్టలేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇది బాధ్యతల అప్పగింత మాత్రమేనని ఆయన వివరించారు. కన్నా లక్ష్మీనారాయణకు మరో అవకాశం పార్టీ కల్పించనుందని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.