బద్వేలు ఉప ఎన్నిక బరిలోకి కాంగ్రెసు: అభ్యర్థిగా కమలమ్మ
బద్వేలులో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ ఏకగ్రీవం అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటికే బిజెపి పోటీ చేయడానికి నిర్ణయించుకోగా, తాజాగా కాంగ్రెసు తన అభ్యర్థిగా కమలమ్మ పేరను ఖరారు చేసింది.
కడప: బద్వేలు శానససభ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి దాసరి సుధ ఏకగ్రీవం అయ్యే సూచనలు కనిపించడం లేదు. Badvel bypollలో ఎన్నిక అనివార్యంగా మారుతోంది. తాజాగా, కాంగ్రెసు తన అభ్యర్థిని ఖరారు చేసింది. కమలమ్మను తమ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెసు నాయకత్వం ఎంపిక చేసింది.
పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగు దేశం పార్టీ (టీడీపీ) పోటీ నుంచి తప్పుకున్నాయి. తన మిత్రపక్షం జనసేన పోటీ నుంచి తప్పుకోవడం ఇష్టంలేని బిజెపి తన అభ్యర్థిని పోటీకి దించాలని నిర్ణయం తీసుకుంది. బిజెపి నలుగురి పేర్లను పరిశీలించి, అధిష్టానం ఆమోదం కోసం జాబితాను పంపించింది. అధిష్టానం అభ్యర్థిని ఎంపిక చేస్తుంది.
Also Read: భిన్నాభిప్రాయాలు సహజం.. జనసేనతో మిత్రపక్షంగానే వుంటాం: సోము వీర్రాజు వ్యాఖ్యలు
ఓ వైపు కాంగ్రెసు పార్టీ, మరో వైపు బిజెపి పోటీకి దిగుతుండడంతో దాసరి సుధ ఏకగ్రీవం కావడం సాధ్యం కావడం లేదనే అర్థమవుతోంది. వైసీపీ ఎమ్మెల్యే దాసరి వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేలుకు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఆయన సతీమణి దాసరి సుధను పోటీకి దించాలని వైసిపీ నాయకత్వం నిర్ణయించింది. ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
బద్వెలు ఉప ఎన్నిక పోలింగ్ అక్టోబర్ 30వ తేదీన జరగనుంది. జనసేన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి పోటీకి దిగుతుండడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. అయితే, బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండిస్తున్నారు. తమ ఇరు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందని చెబుతున్నారు. బద్వేలులో తమ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి Pawan Kalyanను కూడా ఆహ్వానిస్తామని ఆయన చెబుతున్నారు. అయితే, పవన్ కల్యాణ్ ప్రచారానికి వస్తారా అనేది సందేహమే.
Also Read: బద్వేల్‌లో మా పార్టీ అభ్యర్ధికి ప్రచారం చేయాలని పవన్ ను కోరుతాం: సోము వీర్రాజు
వైసీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ బద్వెలు లో పోటీకి దిగకూడదని నిర్ణయం తీసుకున్నారు. పవన్ కల్యాణ్ తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత తాము కూడా పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు టీడీపీ ప్రకటించింది. తమ అభ్యర్థిగా రాజశేఖర్ ను ప్రకటించి కూడా టీడీపీ పోటీ నుంచి విరమించుకుంది.