న్యూఢిల్లీ: వెనుకబడిన జిల్లాలకు  ఇచ్చిన నిధులను కేంద్రం వెనక్కు తీసుకోవడంపై  టీడీపీ ఎంపీలు  సోమవారం నాడు లోక్‌సభ నుండి వాకౌట్ చేశారు.  కేంద్రం తీరుపై  టీడీపీ ఎంపీలు తీవ్రంగా ఎండగట్టారు.

వెనుకబడిన జిల్లాలకు కేంద్రం రూ. 350 కోట్లను  ఇచ్చిందన్నారు. ఆ తర్వాత  ఈ నిధులను కేంద్రం వెనక్కు తీసుకొందన్నారు.  ఈ విషయమై టీడీపీ ఎంపీలు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేశారు.   టీడీపీ ఎంపీలు  ఆందోళన కారణంగా  సభను కొద్దిసేపు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత  జీరో అవర్‌లో  టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు  వెనుకబడిన ప్రాంతాలకు  కేంద్రం ఇచ్చిన నిధులను  వెనక్కి తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

వెనుకబడిన జిల్లాలకు  కేంద్రం ఇచ్చిన నిధులను తిరిగి వెనక్కు తీసుకొన్న విషయాన్ని రామ్మోహన్ నాయుడు  ప్రస్తావించారు. యూసీలు సమర్పించినా కూడ యూసీలు సమర్పించలేదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై తప్పుడు ఆరోపనలు చేస్తోందన్నారు.  కేంద్ర ప్రభుత్వం తీరును  ఆయన తన ప్రసంగంలో ఎండగట్టారు.  బుందేల్ ఖండ్ తరహ ప్యాకేజీ ఇస్తామని చెప్పినా కేంద్రం తక్కువ నిధులు ఇచ్చి  వాటిని వెనక్కు తీసుకొందన్నారు.యూసీలు సమర్పించడంలో దేశంలోనే ఏపీ రాష్ట్రం మూడో స్థానంలో ఉన్న విషయాన్ని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. 

ఏపీపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని రామ్మోహన్ నాయుడు చెప్పారు.  అయితే ఈ సమయంలో  టీడీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించడంపై స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో టీడీపీ ఎంపీలు వ్యవహరిస్తున్న తీరును ఆమె తప్పుబట్టారు. 

 ప్లకార్డులు ఎందుకు ప్రదర్శిస్తున్నారని ఆమె ప్రశ్నించారు.  ఇదేమైనా  ఆట స్థలమా అంటూ టీడీపీ ఎంపీలపై ఆమె విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంతో  టీడీపీ ఎంపీలు సంతృప్తి చెందలేదు. దీంతో  సభ నుండి టీడీపీ ఎంపీలు వాకౌట్ చేశారు.