విశాఖ: తన వల్లే తెలుగుదేశం పార్టీకి పేరు వచ్చిందనే భ్రమలో వాసుపల్లి గణేష్ వున్నారని మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. ప్రస్తుతం రాజకీయాల్లో విలువలు చచ్చిపోయాయని... అధికారం పోతే బతకలేమన్నట్లుగా నాయకులు వ్యవహరిస్తున్నారంటూ వాసుపల్లితో పాటు జంపింగ్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అయ్యన్న కామెంట్ చేశారు. 

''మాకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి...కానీ విలువలే ముఖ్యమని వాటికి లొంగలేదు. కానీ కొందరు నాయకులు ఆ ఆఫర్లకు లొంగిపోయి పార్టీని వీడుతున్నారు. ఇప్పుడున్న రాజకీయాలకు మేము ఇమడలేకపోతున్నాము'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

''చాలా సార్లు చంద్రబాబు వాసుపల్లి మాటలే విన్నారు.‌ ఆయనకు అంతటి గౌరవం ఇస్తే ఇప్పుడు కనీస మర్యాద లేకుండా వ్యవహరించారు. ఏం చేద్దామని వైసిపిలోకి వెళ్లారు? సొంత పార్టీ వారికే అపాయింట్ మెంట్ జగన్ ఇవ్వడం‌ లేదు. వైసిపిలోకి వెళ్లిన వారందరూ ఇంట్లో కాలీగా కూర్చుంటున్నారు'' అన్నారు. 

read more  అనర్హత పిటిషన్‌కైనా, ఎన్నికలకైనా సిద్ధమే: టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్

''యుద్దం అంటూ మొదలైతే వెనక్కి తిరిగే ప్రసక్తే వుండకూడదు.భయపడి పారిపోయే దోరణి మాకు లేదు. టిడిపి ఒక విశ్వవిద్యాలయం లాంటిది. తెలంగాణా కేనినేట్ లో సగం మంది నాయకులు మన పార్టీ నుంచి వెళ్లన వారే'' అని అయ్యన్న పేర్కొన్నారు. 

''జగన్ యూరప్ లో ఒక సలహాదారుని నియమించుకున్నారు. రాష్ట్రం ఆర్ధికపరిస్ధితి అధోగతలో వున్నప్పుడు ఇది దుబారే ఖర్చు కాదా...? జగన్ కు క్రమశిక్షణ, పద్దతి లేదు. జగన్ తాను చేసిన అరచాకాలు మళ్లించడానికే మైండ్ గేమ్ ఆడుతున్నారు. ప్రధాని మోడీ మెడలు వంచుతామని జగన్ ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు మోడీ కాళ్లు పట్టుకోడానికి సిద్దంగా వున్నారు'' అని ఎద్దేవా చేశారు. 

''చట్టాలు, న్యాయస్ధానాలంటే జగన్ కు గౌరవం లేదు. అమరావతిలో జడ్జిలకు చంద్రబాబు ఇళ్ల స్ధలాలు కేటాయిస్తే దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు. 2005 లో వైఎస్ సిఎం గా వున్నపుడు హైదరాబాదులో 500 చ.గ.ఇళ్ల స్ధలాలు న్యాయమూర్తులకు ఇచ్చారు. అదీ దురుద్దేశంతో ఇచ్చినట్లేనా..? అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు. అమరావతి లోనే మరి జగన్ ఇల్లు ఎందుకు  కట్టుకున్నారు..?'' అని అయ్యన్న నిలదీశారు.