క్షీణిస్తున్న చంద్రబాబు ఆరోగ్యం... అత్యంత ప్రమాదకరంగా..: అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
రాాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న చంద్రబాబు ఆరోగ్యం రోజురోజుకు మరింత క్షీణిస్తోందని... ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా వుందని అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసారు.

విశాఖపట్న : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన కుటుంబం, టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నా వైద్యం అందించడంలేదని... దీంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయని అంటున్నారు. ఇదే అనుమానాన్ని ఏపి టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యక్తం చేసాడు. జైల్లో చంద్రబాబును చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు.
ప్రస్తుతం చర్మ సంబంధిత సమస్యతో చంద్రబాబు బాధపడుతున్నారని... బరువు కూడా చాలా తగ్గారని అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన ఆరోగ్యం అత్యంత ప్రమాదకరంగా వున్నప్పటికీ వైసిపి ప్రభుత్వం పోలీసులతో కలిసి కుట్రలు చేస్తోందన్నారు. చంద్రబాబు ఏమీ కాలేదని డాక్టర్లు చెబుతున్నట్లుగా తప్పుడు నివేదికలు ఇస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేపట్టిన డాక్టర్ల కంటే ముందే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం కాలేదంటూ మాట్లాడారు... ఇలాంటివే అనేక అనుమానాలకు తావిస్తున్నాయని అచ్చెన్నాయుడు అన్నారు.
చంద్రబాబు అనారోగ్యానికి గురవడంతో ఆయన గదిలో ఏసి పెట్టాలని న్యాయస్థానం ఆదేశించిందని... అయినా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అచ్చెన్న అన్నారు. చంద్రబాబు గదిలో ఇప్పటికి ఏసి పెట్టలేదంటూ ఆందోళన వ్యక్తం చేసారు. అంతేకాదు చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయమూ బయటకు రాకుండ ప్రభుత్వం జాగ్రత్త పడుతోందని... ఇదే అనుమానాస్పదంగా వుందన్నారు. తన తండ్రి మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలని నారా లోకేష్ జైళ్ల శాఖ డిఐజిని కోరినా ఇవ్వడంలేదని అచ్చెన్నాయుడు అన్నారు.
Read More చంద్రబాబు అరెస్ట్ .. న్యాయానికి సంకెళ్లు పేరుతో టీడీపీ శ్రేణుల ఆందోళన
జైల్లో చంద్రబాబుకు ఎలాంటి వైద్యం అందిస్తున్నారో బయటపెట్టాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేసారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై టిడిపి శ్రేణులే కాదు యావత్ రాష్ట్ర ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. చంద్రబాబుకు ఏ హాని జరిగినా పూర్తి బాధ్యుడు సీఎం వైఎస్ జగనే అని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంపై తమకు ఏమాత్రం నమ్మకంలేదు కాబట్టి చంద్రబాబును ఎయిమ్స్ కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేసారు.
అక్రమ కేసులు పెట్టి నిరంతరం ప్రజల్లో వుండే చంద్రబాబును అర్ధరాత్రి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని అచ్చెన్నాయుడు అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును పెట్టి 38 రోజులైందని... ఇప్పటివరకు ఈ స్కిల్ కేసులో ఒక్క రూపాయి అవినీతి చేశారని నిరూపించలేకపోయారన్నారు. అయినా వ్యవస్థలను మేనేజ్ చేసి జైల్లోనే వుంచుతున్నారని... దీని వెనక పెద్ద కుట్ర దాగి వుందని అన్నారు. జగన్ సర్కార్ తీరు, పోలీసుల చర్యలు, వైసిపి నాయకుల మాటలను బట్టి చంద్రబాబు ప్రాణహాని వుందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయని అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేసారు.