చంద్రబాబు అరెస్ట్ .. న్యాయానికి సంకెళ్లు పేరుతో టీడీపీ శ్రేణుల ఆందోళన
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు ‘‘న్యాయానికి సంకెళ్లు’’ పేరుతో ఆదివారం ఆందోళనకు దిగారు. నారా భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి, చినరాజప్ప, అచ్చెన్నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు ‘‘న్యాయానికి సంకెళ్లు’’ పేరుతో ఆదివారం ఆందోళనకు దిగారు. చేతులకు కాళ్లు, రిబ్బన్లతో సంకెళ్లు వేసుకుని రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ఈ కార్యక్రమం జరిగింది. నిరసనలో పాల్గొన్న అనంతరం ఆ వీడియోలను టీడీపీ నేతలు , కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాజమండ్రిలోని టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన న్యాయానికి సంకెళ్లు నిరసన కార్యక్రమంలో నారా భువనేశ్వరి, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప తదితరులు పాల్గొన్నారు.
అటు విశాఖలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. జగన్ గూబగుయ్యిమనిపించేలా న్యాయానికి సంకెళ్లు కార్యక్రమానికి భారీ స్పందన వచ్చిందన్నారు. అరెస్ట్ చేసి ఇన్ని రోజులు కావొస్తున్నా చంద్రబాబు నేరానికి సంబంధించి ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
మరోవైపు.. "న్యాయానికి సంకెళ్లు" ఇంకెన్నాళ్లని నారా లోకేష్, బ్రాహ్మణి సైతం నినదించారు. హైదరాబాద్లోని తమ నివాసంలో చేతులకు తాళ్లు కట్టుకుని చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసించారు. ఏ ఆధారాలు లేకపోయినా, రాజకీయ కక్షతో, ప్రజల నుంచి చంద్రబాబుని దూరం చేసేందుకు అక్రమంగా అరెస్టు చేశారని లోకేష్ దంపతులు మండిపడ్డారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచి చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. జైలులో ఆరోగ్యం క్షీణించినా తప్పుడు నివేదికలు ఇస్తూ అంతా బావుందని ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.