గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనసభాపక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడిని తెల్లవారు జామున పోలీసులు అరెస్టు చేయడం అమానుషమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతో బలహీన వర్గాలకు చెందిన నేతల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బలహీన వర్గాలను అణచివేయడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని మండిపడ్డారు.

''ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్నందుకే ఈ విధంగా కేసులు పెట్టి, అరెస్టులు చేసి వేధిస్తున్నారు. ఈఎస్ఐ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి మానిటర్ చేసే బాధ్యత మాత్రమే ఉంటుంది. మిగిలిన అన్ని రకాల బాధ్యతలు డైరెక్టర్లపైనే ఉంటాయి. కానీ జరగని కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ.. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని అమానవీయంగా కనీసం మందులు వేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం జగన్ నిరంకుశ చర్యలకు నిదర్శనం'' అని అన్నారు. 

''ఇంత వరకు నోటీసులు ఇవ్వలేదు. సమాచారం అందించలేదు. చేత్తో నాలుగు ముక్కలు రాసి అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించడం జగన్ ప్రభుత్వం ఎంత కక్ష పూరితంగా వ్యవహరిస్తుందో అర్ధమవుతోంది. తెలంగాణలో కూడా ఇదే రకమైన కుంభకోణం వెలుగులోకి వస్తే అక్కడి డైరెక్టర్ ను బాద్యుల్ని చేశారు. కానీ  ఇక్కడ మంత్రిగా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం రాజకీయ కుట్ర కాదా.?'' అని నిలదీశారు. 

''రేపు అసెంబ్లీలో మీ ఇసుక అవినీతి, మద్యం దోపిడీ, భూ కుంభకోణాలు, గనుల యజమానులపై జరుగుతున్న దౌర్జన్యాలను ప్రశ్నిస్తారనే భయంతో అరెస్టు చేశారని అర్ధమవుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. అరెస్టు చేస్తామనేలా జగన్ వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో కింజరాపు కుటంబానికి ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేందుకే ఇలాంటి కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారు'' అని అన్నారు. 

ఏసీబీ కార్యాలయానికి అచ్చెన్నాయుడు.. ఏం జరుగుతుందో చూద్దామంటూ వ్యాఖ్యలు

''ఆరు లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని నాడు పుస్తకాలు వేశారు. ఆరు రూపాయల అవినీతి కూడా ఏడాదిలో నిరూపించలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు పప్పు బెల్లాలపై, మజ్జిగపై సీబీఐ విచారణ అంటున్నారు. ఇందుకా సీబీఐ ఉన్నది.? మీకు ధైర్యం ఉంటే.. మీ ఏడాది పాలనలో జరిగిన ఇసుక అక్రమాలపై, మద్యం జే ట్యాక్స్ పై, భూ కుంభకోణాలపై, రివర్స్ టెండరింగ్ ద్వారా కొట్టేసిన కమిషన్లపై సీబీఐ విచారణ జరగాలి. అంతే గానీ ప్రజలకు మేలు చేసే పండుగ కానుకలపై, దేవాలయాల్లో పంచే మజ్జిగ ప్యాకెట్లపై కాదని గుర్తుంచుకోవాలి'' అని  సూచించారు. 

''ప్రభుత్వం తీసుకునే అప్రజాస్వామిక నిర్ణయాలను కోర్టులు వరుసగా మొట్టికాయలు వేస్తున్నాయి. మీ నియంతృత్వ పోకడలను ఎండగడుతున్నాయి. వాటి నుండి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం బడుగు బలహీన వర్గాల నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. అచ్చెన్నాయుడు గారిని భేషరతుగా విడుదల చేయాలి. లేకుంటే ప్రజా ఉద్యమం మొదలవుతుంది'' అని రవీంద్ర  హెచ్చరించారు.