గుంటూరు: వైసీపీ ప్రభుత్వానికి ప్రచారం ఎక్కువ పనితనం తక్కువగా ఉందని...ఆరోగ్య శ్రీ కింద 2,200 వ్యాధులను చేర్చామని, 6 జిల్లాలకు నూతనంగా సేవలను విస్తరించామని, ఆ పథకాన్ని ఈప్రభుత్వమే కొత్తగా కనిపెట్టిందన్నట్లుగా డబ్బాలు కొట్టుకోవడమే అందుకు నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ఎద్దేవాచేశారు. 

శుక్రవారం ఆయన మంగళగిరి లోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  వైసీపీ ప్రభుత్వానికి ప్రచారంపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదన్న ఆయన, అద్దె ఇంటికి వెళ్లిన ప్రతిసారీ గృహప్రవేశం చేసినట్టుగా ప్రభుత్వ వైఖరి ఉందని దెప్పిపొడిచారు. అద్దె ఇంటికి వెళ్లిన ప్రతిసారీ గృహ ప్రవేశం చేసి తామే కొత్తగా ఇంటిని నిర్మించుకున్నట్లుగా చెప్పుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. 

ఆరోగ్యశ్రీని రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభిస్తే చంద్రబాబు వచ్చాక దాని పరిధిని పెంచి, బడ్జెట్ లో కేటాయింపులు కూడా పెంచడం జరిగిందన్నారు. దానితో పాటుగా గత ప్రభుత్వం సీ.ఎమ్. ఆర్. ఎఫ్ కింద ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి విరివిగా ఆర్థిక సహాయం కూడా చేసిందని అశోక్ బాబు తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆరోగ్య శ్రీ పథకాన్ని తామే కొత్తగా భూమిమీదకు తీసుకొచ్చినట్లుగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. 

2019-20కి వైద్యరంగానికి బడ్జెట్లో రూ.11,399కోట్లు  కేటాయించామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది మాత్రం కేవలం రూ.7,408కోట్లేనని ఎమ్మెల్సీ స్పష్టంచేశారు. 2020-21కి కూడా అంతేమొత్తం కేటాయించారని, ఖర్చుఎంత చేస్తారో చూడాల్సి ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం 2018-19లో ప్రజారోగ్యానికి రూ.8,917కోట్లు ఖర్చు చేసిందన్నారు. కేటాంపులుచేసిన వాటిలో పూర్తిగా ఖర్చుచేయకుండా, ఊరికే డబ్బాలు కొట్టుకోవడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. 

ప్రభుత్వం చేయాల్సింది పెద్దపళ్లెం ముందు పెట్టడం కాదని, దానిలో ఎంతఆహారం నింపి, ప్రజల ఆకలి తీర్చారన్నదే ముఖ్యమన్నారు.  ప్రజల సొమ్ముతో పత్రికల్లో ప్రకటనలు ఇస్తే వారి అనారోగ్యం నయమవదనే విషయాన్ని ఫ్యాన్ పార్టీ తెలుసుకుంటే మంచిదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్య రంగానికి కేటాయింపులు ఘనంగా ఉన్నా ఖర్చు అధమంగా ఉందని అశోక్ బాబు చెప్పారు.  

read more  ఆ డబ్బు చెన్నై నుండి మారిషస్ కు..జగన్ కుటుంబసభ్యుల హస్తం: మాజీ మంత్రి సంచలనం

రాష్ట్రంలో అసలు ఆరోగ్యశ్రీ అమలవుతోందని ప్రభుత్వం చెప్పగలదా అని ప్రశ్నించిన ఆయన, ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిడ్ కు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్నారో చెప్పాలన్నారు.  సరైన వైద్య సదుపాయాలు, సౌకర్యాలు లేక క్వారంటైన్ కేంద్రాల్లోని కోవిడ్ బాధితులు అల్లాడుతున్నారని, ఇక బయట ఉన్నవారికి ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స చేస్తామని బీరాలుపలకడం ఈ సిగ్గుమాలిన ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ప్రభుత్వం ఆలోచించాల్సింది ఎన్ని వ్యాధులు ఆరోగ్యశ్రీ కింద చేర్చామన్నది కాదని, ఎంతమందికి మెరుగైన వైద్యసేవలు అందించామనేదే నన్నారు. 

2,200 వ్యాధులు ఆరోగ్య శ్రీ కిందికి వస్తాయని, 6 జిల్లాలకు వైద్యసేవలు విస్తరించామని పనికిరాని ప్రచారం చేసుకుంటే సరిపోదని టీడీపీ ఎమ్మెల్సీ మండిపడ్డారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితులకు సరిపడినన్ని పడకలు కూడా లేవని, గుంటూరులో 1200 పడకలుంటే 2వేలమంది వరకు బాధితులున్నారన్నారు. కోవిడ్ ను ఆరోగ్యశ్రీలో కలిపినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండనదన్నారు.  వైసీపీ ప్రభుత్వం కోవిడ్ ను కూడా ఆదాయ వనరుగా మార్చుకుందని, బ్లీచింగ్ పౌడర్, టెస్టింగ్ కిట్లు, క్వారంటైన్ కేంద్రాల్లో అందించే ఆహారం సహా అన్నింటిలో అవినీతికి తెరలేపారన్నారు.  

ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందడం లేదని ఈ విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ కింద ఏ ఆసుపత్రిలోనూ రోగులను చేర్చుకోవడంలేదని, ఆన్ లైన్ లో చూస్తే ఆ పథకం కింద కేటాయించిన పడకలన్నీ ఖాళీగానే ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ఆరోగ్య శ్రీ కింద కోవిడ్ బాధితుడికి ఎక్కడైనా వైద్యసేవలు అందినట్లు ముఖ్యమంత్రిగానీ, వైద్యారోగ్యశాఖ మంత్రి గానీ చెప్పగలరా? అని అశోక్ బాబు ప్రశ్నించారు. 

కోవిడ్ చికిత్స కోసం ఎక్కడైనా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే, వారు వేసే బిల్లుల దెబ్బలకు రోగులు ఠారెత్తిపోతున్నారన్నారు. గత ప్రభుత్వం కూడా ద్విచక్ర వాహన అంబులెన్సులు, తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ లు, మహాప్రస్థానం సేవలను ప్రారంభించిందన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి అందించే ఆర్థిక సాయమైన సీ.ఎమ్.ఆర్.ఎఫ్ పంపిణీనికూడా జగన్ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిందన్నారు. 2019మార్చి నాటికి ఇవ్వాల్సిన చెక్కులను కూడా నిలిపేసిన జగన్ ప్రభుత్వం, వేలాదిమంది రోగులకు తీరని అన్యాయం చేసిందన్నారు.  

చంద్రబాబు ప్రభుత్వంలో ఏర్పాటైన మెడ్ టెక్ జోన్ పై దుర్మార్గంగా దుష్ప్రచారం చేసినవారికి  ఇప్పుడు అదే దిక్కయ్యిందన్నారు. కేంద్రం, దాతలు కోవిడ్ కోసం ఇచ్చిన సొమ్మును కూడా దేనికి వాడుతున్నారో చెప్పకుండా ప్రభుత్వ పెద్దలు దుర్వినియోగం చేస్తున్నారని అశోక్ బాబు మండిపడ్డారు. కోవిడ్ బాధితుల కోసం పడకల సంఖ్య పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్న ఆయన ప్రజలకు రంగుటద్దాలు తగిలించి వాస్తవాలు తెలియకుండా ఎల్లకాలం వారిని మభ్యపుచ్చలేరని చెప్పారు. 

ప్రభుత్వం ఆరోగ్యరంగంపై ఎంత శ్రద్ధతో పనిచేస్తుందో కోవిడ్ బాధితుల కోసం తీసుకుంటున్న చర్యలే చెబుతున్నాయన్నారు. మేమేదో చేశామనే ప్రచారం కన్నా, ఎంతమందికి మంచి జరిగిందనేదే ముఖ్యమని, జగన్ ప్రభుత్వం ఇప్పటికైనా దుర్మార్గంగా విషప్రచారం చేయడం మానుకోవాలని అశోక్ బాబు హితవు పలికారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటం ప్రభుత్వానికే సంకటంగా మారుతుందని... ఆరోజు దగ్గర్లోనే ఉందన్నారు.  

ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ అమలయ్యేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, కోవిడ్ బాధితులకోసం పడకలు పెంచాలని, క్వారంటైన్ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించాలని, సీ.ఎమ్.ఆర్.ఎఫ్ సాయం అందరికీ అందేలా చూడాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.