చంద్రబాబునాయుడుకు అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత పెద్ద షాకే ఇచ్చారు. మూడున్నరేళ్ళ క్రితమే వైసిపి నుండి టిడిపిలోకి ఫిరాయించిన గీత నుండి ఈ విధమైన షాక్ ఎదురవుతుందని చంద్రబాబు ఊహించి ఉండరు. అందులోనూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపధ్యంలో పార్లమెంటు ఉభయసభల్లోనూ టిడిపి ఎంపిలు ఆందోళనలు చేస్తుండగా చంద్రబాబును ఉద్దేశించి గీత వేసిన ప్రశ్నలు ఇరకాటంలొకి నెట్టేశాయి.

ఇంతకీ గీత ఏమన్నారంటే? శుక్రవారం పార్లమెంటు బయట గీత మీడియాతో మాట్లాడతూ, ఏపికి ప్రత్యేకహోదా వచ్చేందుకు ఉన్న అర్హతలేంటని చంద్రబాబును నిలదీసారు. కేంద్ర జిడిపికన్నా రాష్ట్ర జిడిపి చాలా ఎక్కువని చంద్రబాబు చెబుతున్న విషయాన్ని ప్రస్తావించారు. జిడిపి ఎక్కువగా ఉందంటే రాష్ట్రం అభివృద్ధిలో ఉందన్న మాటే కదా అంటూ లాజిక్ తీశారు. అదే విధంగా పెట్టుబడుల సదస్సులు నిర్వహించటం వల్ల లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరినట్లు చంద్రబాబు చెప్పిన విషయాన్ని కూడా గుర్తుచేశారు.

దేశ, విదేశాల నుండి లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగితే ఇక కేంద్రం నుండి నిధులు ఎలా వస్తాయంటూ ప్రశ్నించారు. పోలవరంకు కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్రప్రభుత్వం ఎందుకు లెక్కలు చెప్పటం లేదని నిలదీశారు. కేంద్రం నుండి వచ్చిన నిధులకు రాష్ట్రం లెక్కలు చెప్పకపోతే మళ్ళీ కేంద్రం నిధులు ఎలా ఇస్తుంది? అంటూ మండిపడ్డారు.

విభజన హామీలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం టిడిపి, వైసిపి ఎంపిలు చేస్తున్న నిరసనలు, ఆందోళనలంతా ఒట్టి డ్రామాగా తేల్చేశారు. రెండు పార్టీల ఎంపిలు చేస్తున్న ఆందోళన డ్రామానే అయితే మరి గీత ఏ పార్టీ తరపున ఎంపిగా గెలిచినట్లో? మొత్తానికి చంద్రబాబును ఉద్దేశించి గీత లేవనెత్తిన ప్రశ్నలు మోడి వైఖరికి మద్దతుగా కనబటం లేదూ?