గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వల్లే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీకి మొదటిస్థానం వచ్చిందని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు పేర్కొన్నారు. 2019 మార్చి వరకు చేసిన సంస్కరణలను ప్రామాణికంగా తీసుకోవడంతో వలనే ఏపీకి మొదటి స్థానం వచ్చిందని ఆయన అన్నారు.  

''వైసిపి అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో ఏపీకి ఒక్క పరిశ్రమనైనా తీసుకొచ్చారా? ఒక్క ఉద్యోగమైనా కల్పించారేమో ఆత్మ విమర్శ చేసుకోవాలి. విద్వేషాలు, పునాదులపై నిర్మితమైన జగన్ అధికారం ఆంద్రప్రదేశ్ ను అధోగతి పాలు చేసింది'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

''పరిశ్రమల రంగంలో రాష్ట్ర ఆదాయం 2013-14 లో రూ 1.07 లక్షల కోట్లు వుంటే 2017-18 నాటికి టీడీపీ ప్రభుత్వ కృషితో రూ 1.62 కోట్లకు పెరిగింది. కానీ ఇప్పుడు రాష్ట్ర పరిస్థితిని చూసి అసమర్ధులకు అధికారం ఇచ్చి భవిష్యత్ ను అంధకారం చేసుకొన్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు'' అని అన్నారు. 

''పెండింగ్ పారిశ్రామిక రాయితీలు తాము చెల్లించినట్లు జగన్ గొప్పలు చెప్పుకోవడం పచ్చి అబద్దం. గత ప్రభుత్వ పారిశ్రామిక పెండింగ్ రాయితీలు రూ 3,675 కోట్లను 28,083 పరిశ్రమలకు తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించిందని స్వయంగా జగన్ ప్రభుత్వం 2019 జులై లో విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్న విషయం గుర్తించాలి'' అని సూచించారు. 

read more   జగన్ రెడ్డికి వచ్చిన ఆ కష్టం పగవాడికి కూడా రాకూడదు: నారా లోకేష్

''జగన్ పాలనంతా మురికి కూపంగా మారింది. తిట్ల దండకాలతో, చౌకబారు విమర్శలతో ఆంద్రప్రదేశ్  పరువు తీశారు.  చంద్రబాబు తీసుకొచ్చిన విధానాల వల్లే  నాలుగేళ్ల నుండి సులభతర వాణిజ్య విధానంలో ఏపీకి మొదటి స్థానం దక్కుతోంది. ఒకడిని చూస్తే పెట్టబుద్ది ఇంకొకన్ని చూస్తే మెత్త బుద్ధి అన్నట్లు నాడు చంద్రబాబు నాయుడిని చూసి రాష్ట్రంలో పెట్టుబుడులు పెడితే జగన్ ప్రభుత్వంలో ఉన్న పెట్టుబడులు ఊడబీక్కొని వెళ్లే పరిస్థితి వచ్చింది'' అంటూ సెటైర్లు విసిరారు. 

''అంవాఛనీయ, అవకాశవాద రాజకీయం ఆంధ్రప్రదేశ్ కు అనర్థదాయకంగా పరిణమించింది.  ర్యాంకులతో మాకు పనిలేదని  చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ ఘనత తమదేనని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. పెట్టుబడులకు గమ్యస్థానంగా చంద్రబాబు రాష్ట్రాన్ని తయారుచేశారు. కాబట్టే ఆయన ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎంతో కొంత రుణాలు రాష్ట్రానికి వస్తున్నాయి'' అని పేర్కొన్నారు. 

''టీడీపీ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు సరియైనవి కాబట్టే పెట్టుబడులు పెట్టడానికి దేశంలోనే ఏపీ అత్యంత అనువైన రాష్ట్రమని కేంద్రం మరోసారి గుర్తించింది.  రాష్ట్రానికి వచ్చిన ర్యాంకుని వినియోగించుకుని పరిశ్రమలు, కంపెనీలు వచ్చేలా చొరవ చూపి రాష్ట్రాభివృద్ధి దిశగా అడుగులు వేయాలి'' అని జగన్ ప్రభుత్వానికి కళా వెంకట్రావు సూచించారు.